పుట:Srinadhakavi-Jeevithamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కవిజీవితమును నేను 1918 లో ముద్రించి ప్రచురించి యున్నాను. తరువాత నైదు సంవత్సరములకు అనఁగా 1923 సంవత్సరమున నా మిత్రులగు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు శృంగారశ్రీనాథ మను పేరుతో నీ కవిజీవితమునే వ్రాసి ప్రచురించినారు. ఆ గ్రంథమున శృంగారమును గూర్చి యేమియు లేకపోయినను ఎగతాళి చేయుటకో యన్నటులు వారా నామకరణముఁ గావించిరి. వీరును వీరేశలింగం పంతులవారి విమర్శామార్గమును గర్హించువారివలెఁ గన్పట్టినను, మాటలభేదమె గాని పంతులవా రేయుద్దేశముతో నట్లు వ్రాయ సాహసించిరో నామిత్రులును దృష్టాంతపూర్వకముగా బలపఱచుటకుఁ బ్రయత్నింప సాహసించిరి. అందువలన వీరి యభిప్రాయములను గూడ నీ రెండవకూర్పున సహేతుకముగా ఖండింపవలసి వచ్చినది. ఎనుబది సంవత్సరముల కాలము బ్రదికి నలుబది సంవత్సరము లఖండవైభవ మనుభవించి కీర్తి శేషుఁడై చన్న సార్వభౌమునిజీవితచరిత్రమును దెలుపుటకు మాత్రమె యీ గ్రంథ ముద్దేశింపఁ బడినది గాని యాతని సాహిత్యసౌష్టవముల విమర్శము ప్రకాశింపఁ జేయుట కుద్దేశింపఁ బడినది కాదు. వీని జీవముతో సంబంధించిన గాథలు పెక్కులు గలవు. వీరి పేరుతో సంబంధించిన చాటువు పెక్కులు గలవు. వీని సత్యాసత్యములను దెలుపునట్టి విమర్శ లిందుఁ గలవు. ఈ నడుమ నీకవిని గూర్చి పండితులు పత్రికలలో గావించిన విమర్శలు గూడ సందర్భానుసారముగా వారి వారి నామములతో నిందుఁ బేర్కొనఁబడి యున్నవి. వారికెల్లరకు నా కృతజ్ఞతా వందనముల నిందుమూలముగాఁ దెలుపుచున్నాను. దుర్భరవ్యాధి పీడితుఁడనై యుండుట చేత నచ్చుపడిన చిత్తుప్రతులను స్వయముగాదిద్దు కొనుటకు సాధ్యపడనందున నందందు నచ్చు తప్పులుండవచ్చును. చదువరులు మన్నించి వాని సంస్కరించు కొనవలయునని ప్రార్థించుచున్నాను.

గ్రంథకర్త.