Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పీఠిక


పురాణములు :

వేదవాఙ్మయము వలెనే పురాణవాఙ్మయమును ప్రాచీన భారతీయ సంస్కృతికిఁ బట్టుఁ గొమ్మ యని చెప్పఁ దగినట్టిది. భారతమునకుఁ బంచమ వేదమని పేరున్నట్లే పురాణ సముదాయమనుకును బంచమ వేదమను పేరున్నది. దీనినిబట్టి వేదముల సార మంతయుఁ దరువాతి కాలమునఁ బురాణరూపమునఁ బ్రవచింపఁబడినదని యూహింప వచ్చును. కొంత కాలము క్రిందటి వఱకును బురాణములందుఁ బ్రతిపాదితమైన విషయ మంతయుఁ బుక్కిటి పురాణ మనియు, దానికెట్టి చారిత్రక ప్రాధాన్యము నీయఁ బనిలేదనియు, నొక యభిప్రాయము ప్రబలియుండెను. కాని యిటీవలి పరిశోధనల వలన వాని విలువయుఁ బ్రాధాన్యమును బయల్పడుటచేఁ, బ్రాచీన భారతీయ చరిత్ర నిర్మాణమున కవి యపరిహార్యము లైన సాధనము లని తెలియవచ్చినది. ప్రాచీన భారత దేశమందలి రాజకీయ మత సాంఘిక తత్త్వకళాఁ సంస్కృతి చరిత్రం నెఱుంగుట కంతకంటెఁ బ్రశస్తతరమైన సాధనము మఱొకటి లేదని చెప్పుటలో నతిశయోక్తి లేదు. పురాణము లందలి వంశానుచరితములు చారిత్రికుల కెన్నియోవిధములఁ దోడ్పడఁజాలును. ప్రాచీన భారతదేశ చరిత్రకారులు పురాణోక్త విషయములను బురావస్తు శాసన పరిశోధనల దృష్టితోఁ బరిశీలించి యవి చాలవఱకు సరియైనట్టివే యని యంగీకరించి యున్నారు. పూర్వ రాజవంశముల చరిత్రము సుమారు పండ్రెండు పురాణములలోఁ జెప్పఁబడియున్నది. మౌర్యవంశమును గూర్చి విష్ణు పురాణమందును, ఆదిమ గుప్తరాజులను గూర్చి వాయుపురాణమందును జెప్పబడిన విషయములు సర్వపరిశోధకుల యంగీకారమును బడసినవి. ఈ విధముగాఁ బరిశీలించినచోఁ బ్రాచీన భారతదేశ యథార్థ చరిత్ర నిర్మాణమునకుఁ బురాణ వాఙ్మయ మెంత యమూల్యమైన సాధనమో వేఱుగాఁ జెప్పవలసిన యవసర ముండదు.

సంస్కృతమునఁ బదునెనిమిది మహాపురాణములును బదునెనిమిది ఉపపురాణములునుగలవని సంప్రదాయమును బట్టి తెలియుచున్నది. వీనిలో మహాపురాణములకంటె నుపపురాణము లర్వాచీనము లైనట్టివి. అవి వివిధమత శాఖలతోడి సంబంధమును, స్థానిక ప్రాధాన్యమును గలిగినట్టివి. మహాపురాణములు పదునెన్మిదింటిని శివ విష్ణు దేవీ సంబంధమును బట్టి ప్రధానమును గలిగి తెఱఁగులుగా విభజింపవచ్చును. ఈ విభజనము కేవలము ప్రాధాన్యన్యపదేశమును బట్టి చేయఁబడినదే. ఏలయన నన్ని పురాణములందుఁ బై ముగ్గురు దేవతలకును సంబంధించిన వృత్తాంతములు కానవచ్చును. కాని కొన్ని పురాణములు శివునికో, విష్ణువునకో, దేవికో యధిక ప్రాధాన్య మొసంగుట వలన నవి యా దేవతకే సంబంధించినవను భ్రాంతి కలుగుచుండును. అది నిజముగా భ్రాంతియే. ఒక్కొక్క పురాణమునం దొక్కొక్క దేవతయే ప్రధానముగా స్తుతింపఁబడినను ఏ పురాణముగాని యన్యదేవతల నుపేక్షించుట కాని, నిరసించుట కాని కనఁబడదు. ప్రతి పురాణమునందును