138
గద్య. ఇది పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర, కేసన మంత్రి పుత్ర, సహజ పాండిత్య,పోతానామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను పురాణంబునం బరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుటయు, భాగవత పురాణ వైభవంబును, ఖట్వాంగు మోక్షప్రకారంబును, ధారణా యోగ విషయంబైన మహావిష్ణుని శ్రీపాదా ద్యవయవంబుల సర్వలోకంబు లున్న తెఱంగును, సత్పురుష వృత్తియు, మోక్ష వ్యతిరిక్త సర్వకామ్య ఫలప్రద దేవతా భజన ప్రకారంబును, మోక్ష ప్రదుండు శ్రీహరి యునుటయు, హరి భజన విరహితులైన జనులకు హేయతాపాదనంబును, రాజప్రశ్నంబును, శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుటయు, శ్రీహరివలన బ్రహ్మ రుద్రాది లోక ప్రపంచంబు పుట్టుటయు, శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును, భాగవత వైభవంబును, పరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నలును, అందు శ్రీహరి ప్రధానకర్తయని తద్వృత్తాంతంబు సెప్పుటయు, భగవద్భక్తి వైభవంబును, బ్రహ్మ తపశ్చరణంబునకుం బ్రసన్నుండై హరి వైకుంఠ నగరంబుతోడఁ బ్రసన్నుండైన, స్తోత్రంబు సేసి త త్ర్పసాదంబునం ద న్మహిమవినుటయు, వాసుదేవుండానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవత పురాణ ప్రధాన దశ లక్షణంబు లుపన్యసించుటయు, నారాయణ వైభవంబును, జీవాది తత్త్వసృష్టియు, శ్రీహరి నిత్యవిభూత్యాది వర్ణనంబును, గల్పప్రకారాది సూచనంబును, శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు సెప్పుమని సూతు నడుగుటయు, నను కథలు గల ద్వితీయ స్కంధము సంపూర్ణము. (289)