137
మ. ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
హరి కర్తృత్వము నొల్లఁ డాత్మగత మాయారోపితంజేసి తా
నిరవద్యుండు నిరంజనుండు పరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్
నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వమున్ బొందెడిన్. (280)
వ. బ్రహ్మసంబంధి యగు నీ కల్పప్రకారం బవాంతర కల్పంబుతోడి సంకుచిత ప్రకారంబున నెఱింగించితి. ఇట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్పప్రకారంబులును, తత్పరిమాణంబులును
కాల కల్ప లక్షణంబులును, నవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపంబును, నతివిస్తారంబుగ ముందు నెఱింగింతు వినుము. అదియును బద్మకల్పం బనందగు.అని భగవంతుం
డయిన శుకుండు పరీక్షిత్తునకుఁ జెప్పె. అని సూతుండు మహర్షులకు నెఱింగించిన, (281)
క. విని శౌనకుండు సూతం గనుఁగొని యిట్లనియె సూత! కరుణోపేతా!
జననుత గుణసంఘాతా! ఘన పుణ్యసమేత! విగతకలుషవ్రాతా! (282)
వ. పరమ భాగవ తోత్తముండైన విదురుండు బంధు మిత్ర జాలంబుల విడిచి, సకల భువన పావనంబులును కీర్తనీయంబులును నైన తీర్ధంబులు నగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులును దర్శించి,
క్రమ్మఱ వచ్చి, కొపారవియగు మైత్రేయుంగని, యతని వలన నధ్యాత్మబోధంబు వడసె నని వినంబడు. అది యంతయు నెఱింగింపు మనిన నతం డిట్లనియె. (283)
క. విను మిపుడు మీరు న న్నడి, గిన తెఱఁగున శుకు మునీంద్రగేయుఁ బరీక్షి
జ్జనపతి యడిగిన నతఁడా, తని కెఱిఁగించిన విధంబుఁ దగ నెఱిఁగింతున్. (284)
వ. సావధానులై వినుండు, (285)
ఉ. రామ! గుణాభిరామ! దినరాజ కులాంబుధి సోమ! తోయద
శ్యామ! దశానన ప్రబల సైస్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా! (286)
క. అమరేంద్రసుత విదారణ! కమలాప్త తనూజ రాజ్యకారణ!భవ సం
తమస దినేశ్వర! రాజో, త్తమ! దైవత సార్వభౌమ! దశరథరామా! (287)
మాలిని. నిరుపమ గుణజాలా ! నిర్మలానంద లోలా !
దురిత ఘన సమీరా ! దుష్ట దైత్య ప్రహారా !
శరధి మద విశోషా ! చారు స ద్భక్త పోషా !
సరసిజ దళనేత్రా ! సజ్జన స్తోత్ర పాత్రా !. (288)