Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

సీ. అలఘు తేజోమయంబైన రూపం బిది క్షితినాథ నాచేతఁ జెప్పఁబడియె

మానిత స్థూల సూక్ష్మ స్వరూపంబుల వలన నొప్పెడు భగవ త్స్వరూప

మ మ్మహాత్మకుని మాయా బలంబునఁ జేసి దివ్యమునీంద్రులు దెలియలేరు.

వసుధేశ వాచ్యమై వాచకంబై నామరూపముల్ గ్రియలును రూఢిఁ దాల్చి


ఆ. యుండునట్టి యీశ్వరుండు నారాయణుం, డఖిలధృతి జగ న్నియంతయైన

చిన్నయాత్మకుండు సృజియించు నీ ప్రజా, పతుల ఋషులను బితృతతుల నపుడు. (273)


వ. మఱియును, (274)


సీ. సుర సిద్ధ సాధ్య కిన్నరవర చారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ

భూత భేతాళ కింపురుష కూశ్మాండ గుహ్యక డాకినీ యక్ష యాతుధాన

విద్యాధ రాప్సరో విషధర గ్రహ మాతృగణ వృక హరి ఘృష్టి ఖగ మృగాళి

భల్లూక రోహిత పశి వృక్ష యోనుల, వివిధ కర్మంబులు వెలయఁబుట్టి


తే. జల నభో భూతలంబుల సంచరించు, జంతుచయముల సత్వ రజస్తమోగు

ణములఁ దిర్య క్సురాసుర నర ధరాధి, భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర! (275)


మ. ఇరవొందన్ ద్రుహిణాత్మకుం డయి రమాధీశుండు విశ్వంబు సు

స్థిరతం జేసి హరిస్వరూపుఁ డయి రక్షించున్ సమస్త ప్రజో

త్కర సంహారము సేయు నప్పుడు హరాంతర్యామియై యింతయున్

హరియించున్ బవనుండు మేఘముల మాయంజేయు చందంబునన్. (276)


క. ఈ పగిదిని విశ్వము సం, స్థాపించును మనుచు నణఁచు ధర్మాత్మకుఁడై

దీపిత తిర్య జ్నర సుర, రూపంబు లా దానె తాల్చి రూఢి దలిర్పన్. (277)


సీ. హరియందు నాకాశ మాకాశమున వాయు వనిలంబు వలన హుతాశనుండు

హవ్యవాహనునందు నంబువు లుదకంబు వలన వసుంధర గలిగె ధాత్రి

వలన బహు ప్రజావళి యుద్భవం బయ్యె నింతకు మూలమై యెసఁగునట్టి

నారాయణుఁడు చిదానంద స్వరూపకుం డవ్యయుఁ, డజరుఁ డనంతుఁ డాఢ్యుఁ


తే. డాది మధ్యాంత శూన్యం డనాదినిధనుఁ, డతనివలనను సంధూత మైన యట్టి

సృష్టి హేతుప్రకార మీక్షించి తెలియఁ, జాల రెంతటి మునులైన జనవరేణ్య! (278)


వ. అదియునుం గాక, (279)