పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

తే. హరిపద ధ్యాన పారీణుఁ డాత్మవేది, ప్రకట తేజస్వి యగు బాదరాయణునకుఁ

గోరి యెఱిఁగించె నమ్మహోదారుఁడెలిమి, నాకు నెఱిఁగించె నెఱిఁగింతు నీకు నేను. (257)


వ. అదియుంగాక యిపుడు విరాట్పురుఘనివలన నీ జగంబు లే విధంబున జనియించె, ననియెడి మొదలైన కొన్ని ప్రశ్నలు నన్నడిగితివి. ఏను నన్నింటికి నుత్తరం బగునట్లుగా నమ్మహాభాగవతం

బుపన్యసించెద. ఆకర్ణింపుము. (258)

అధ్యాయము - 10

వ. అ మ్మహాపురాణంబు చతుఃశ్లోక రూపంబున దశ లక్షణంబుల సంకుచిత మార్గంబుల నొప్పు. అందు దశ లక్షణంబు లెయ్యవి? యనిన సర్గంబును, విసర్గంబును, స్ధానంబును,

పోషణంబును, ఊతులను, మన్వంతరంబులును, ఈశానుచరితంబును, ముక్తియు, నాశ్రయంబు ననం బది తెఱంగులయ్యె. దశమవిశుద్ధ్యర్ధంబు తక్కిన తొమ్మిది లక్షణంబులు

సెప్పంబడె అవి యెట్టి వనిన, (259)


తే. మహ దహంకార పంచ తన్మాత్ర గగన, పవన శిఖ తోయ భూ భూతపంచకేంద్రియ

ప్రపంచంబు భగవంతునందు నగుట, సరమందురు దీనిని జనవరేణ్య! (260)


క. సరసిజగర్భుండు విరా, ట్పురుషునివలనం జనించి భూరితర చరా

చర భూతసృష్టిఁ జేయుట, పరువడిని విసర్గ మండ్రు భరతకులేశా ! (261)


క. లోకద్రోహి నరేంద్రా, నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా

వైకుంఠ నాథు విజయం, బాకల్పస్థాన మయ్యె నవనీనాథా! (262)


క. హరి సర్వేశుఁ డనంతుడు, నిరుపము శుభమూర్తి చేయు నిజభక్తజనో

ద్ధరణము పోషణ మవనీ, వర ! యూతు లనంగ గర్మవాసన లరయన్. (263)


తే. జలజనాభ దయాకటాక్ష ప్రసాద, లబ్ధి నిఖిలైక లోకపాలన విభూతి

మహిమఁబొందిన వారి ధర్మములు విస్తరమునఁ బలుకుట మన్వంతరములుభూప! (264)


క. వనజోదరు నవతార క, థనము దదీ యాను వర్తి తతి చారిత్రం

బును విస్తరించి పలుకం, జను నవి యీశాను కథలు సౌజన్యనిధీ ! (265)