పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

125

సవిస్తరంబులుగా నానతిచ్చి కృతార్ధునిఁ జేయఁ బరమేష్ఠితుల్యుండ వగు నీవపూర్వ సంప్రదాయానురోధంబున నర్హుండ వగుదు వని

విష్ణురాతుండైన పరీక్షిన్నరేంద్రుడు బ్రహ్మరాతుండైన శుకయోగి నడిగిన నతండు బ్రహ్మ నారద సంవాదంబును, నేక సంప్రదాయానుగతంబును, గతానుగతిక ప్రకారంబునునై తొల్లి సర్వేశ్వరుండు

బ్రహ్మకల్పంబున బ్రహ్మ కుపదేశించిన భాగవత పురాణంబు వేదతుల్యంబు నీ కెఱింగింతు విను మని చెప్పెనని సూతుండు శౌనకాది మునులకుంజెప్పినట్లు శుక యోగీంద్రుండు పరీక్షి నారేంద్రున

కిట్లనియె. ( 222 )

అధ్యాయము - 9

సీ. భూపాళకోత్తమ! భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుం డైన యట్టి

ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న మహి నొప్పు నీశ్వర మాయలేక

కలుగదు, నిద్రవోఁ గలలోనఁ దోఁచిన దేహబంధంబుల తెఱఁగు వలెను

హరి యోగమాయా మహత్త్వంబునం బాంచభౌతిక దేహ సంభంధుఁ డగుచు


తే. నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి, బాల్య కౌమార యౌవన భావములనుఁ

నర సుపర్వాది మూర్తులఁ బొరసి యేను, నాయ దిది యను సంసార మాయదగిలి. (223)

వ. వర్తింపు చిట్లున్న జీవునికి భగవ ద్భక్తియోగంబున ముక్తి సంభవించుట యెట్లన్న నెప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీత మయిన బ్రహ్మస్వరూపంబు నందు మహిత ధ్యాననిష్టుం డగు నప్పుడు

విగత మోహుండై యహంకార మమకారాత్మ కంబైన సంసరణంబు దొఱంగి ముక్తుండై యుండు. మఱియు జీవేశ్వరులకు దేహసంబంధంబులు గానంబడుచుండు. అట్టి దేహధారియైన

భగవంతునందు భక్తిం జేసి జీవుని ముక్తి యే తఱంగునం గలుగు నని యడిగితివి. జీవుం డవిద్యా మహిమంజేసి కర్మానుగతం బైన మిధ్యారూప దేహసంబంధుండు. భగవంతుండు నిజ

యోగమాయా మహిమంజేసి స్వేచ్ఛా పరికల్పిత చిద్ఘన లీలా విగ్రహుండు. కావున భగవంతుండైన యీశ్వరుండు స్వ భజనంబు ముక్తిసాధన జ్ఞానార్దంబు కల్పితం బని చతుర్ముఖునకుఁ దదీయ

నిష్కపట తపశ్చర్యాది సేవితుండై నిజజ్ఞానానందఘనమైన స్వరూపంబు సూపుచు నానతిచ్చె. అది గావున జీవునికి భగవద్భక్తి మోక్ష ప్రదాయకం బగు. ఇందుల కొక యితిహాసంబు గల దెఱింగింతు.

ఆకర్ణింపుము. దాన భవదీయ సంశయ నివృత్తి యయ్యెడు నని శుకయోగీంద్రుడు రాజేంద్రున కిట్లనియె. (224)