Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

121

తే. లాష్ణిషేణాదు లైన మహాత్ము లెలమిఁ, దవిలి య ద్దేవు భక్తిఁ జిత్తముల నిలిపి

తత్పరాయణ భక్తి దుర్దాంతమైన, విష్ణుమాయఁ దరింతురు విమలమతులు. ( 204 )


మ. అనఘా వీరల నెన్న నేమిటికిఁ? దిర్య గ్జంతు సంతాన ప

క్షి నిశాటాటవి కాఘజీవ నివహ స్త్రీ శూద్ర హూణాదులై

నను నారాయణ భక్తియోగ మహితానందాత్ములై రేని వా

రనయంబున్ దరియింతు రవ్విభుని మాయావైభ వాంభోనిధిన్. ( 205 )


వ. కావున. ( 206 )


క. శశ్వ త్ప్రశాంతు నభయుని, విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్

శాశ్వతుసము సదసత్పరు, నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్ర! ( 207 )


వ. అట్లైన న ప్పుణ్యాత్ముల ననవద్యశీలుర నవిద్య లజ్జావనత వదనయై పొందం

జాలక వైముఖ్యంబునం దవ్వుదవ్వులఁ దలంగిపోవు మఱియు. ( 208 )


చ. హరిఁబరమాత్ము న చ్యుతు ననంతునిఁ జిత్తములోఁ దలంచి సు

స్థిరత విశోక సౌఖ్యముల జెందిన ధీనిధు లన్య కృత్యముల్

మఱచియుఁ జేయ నొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుఁడుం

బరువడి నుయ్యి ద్రవ్వుచు నిపాన ఖనిత్రము మానుకై వడిన్. ( 209 )


ఉ. సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుఁడు సర్వశక్తుఁడున్

సర్వ జగ త్పృసిద్ధుఁడును సర్వగతుం డగు చక్రపాణి యీ

సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై

పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్. (210)


ఉ. కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె

వ్వారును లేరు తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో

దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడకుండినన్

జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్. (211)