116
వ. ఇట్లు పుండరీకాక్షుం డగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు సేయందన మేని కేశద్వయంబు చాలునని యాత్మప్రభావంబు దెలుపు కొఱకు నిజకళా సంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేత కృష్ణంబు లని నిర్దేశించు కొఱకు సితాసిత కేశద్వయ వ్యాజంబున రామ కృష్ణాఖ్యల నవతరించె. అందు భగవంతుడును సాక్షా ద్విష్ణుండును నైన కృష్ణుండు జనమార్గవర్తి యయ్యు నతిమానుష కర్మంబు లాచరించుటం జేసి కేవల పరమేశ్వరుం డయ్యె. అ మ్మహాత్ముండాచరించు కార్యంబులు లెక్కవెట్ట నెవ్వరికి నలవిగాదు. అయినను నాకు గోచరించి నంతయు నెఱింగించెద వినుము. ( 174 )
క. నూతన గరళ స్తని యగు, పూతనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై
చేతనముల హరియించి ప, రేతనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్. ( 175 )
క. వికటముగ నిజపదాహతిఁ, బ్రకటముగా మూఁడు నెలల బాలకుఁడై యా
శకట నిశాటుని నంతక, నికటస్థునిఁ జేసెభక్త నికరావనుఁడై. ( 176 )
క. ముద్దుల కొమరుని వ్రేతల, రద్దులకై తల్లి ఱోల రజ్జునఁ గట్టన్
బద్దులకు మిన్ను ముట్టిన, మద్దుల వడిఁ గూల్చె జనసమాజము వొగడన్. ( 177 )
మ. మదిఁ గృష్ణుండు యశోద బిడ్డఁ డని నమ్మంజాల యోగీంద్ర ! త
ద్వదనాంభోజములోఁ జరాచర సమస్త ప్రాణిజా తాటవీ
నది నద్యద్రి పయోధి యుక్తమగు నానాలోక జాలంబు భా
స్వ దనూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లగఁన్. ( 178 )
చ. వర యమునానది హ్రద నివాసకుఁడై నిజవక్తృ నిర్గత
స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిఁ బొందఁజేయు భీ
కర గరళ ద్విజిహ్వుఁ డగు కాళీయ పన్నగు నా హ్రదంబుఁ జె
చ్చెర వెడలించి కాచె యదుసింహుఁడు గోపక గోగణంబులన్. ( 179 )
మ. తనయా! గోపకు లొక్కరాతిరిని నిద్రంజెందఁ గార్చిచ్చు వ
చ్చినఁ గృష్ణా! మము నగ్ని పీడితుల రక్షింపం దగు గావవే!
యనినం గన్నులు మీరు మోడ్పుఁ డిదె దావాగ్నిన్ వెస న్నార్తు నే
నన వారట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ బద్మాక్షుండు లీలాగతిన్. ( 180 )