Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

115

మ. వికట భ్రూకుటి ఫాలభాగుఁ డగుచున్ వీరుండు గ్రోధారుణాం

బకుఁడై చూచినయంత మాత్రమున న ప్పాథోధి సంతప్త తో

యకణ గ్రాహ తిమింగిల ప్లవ ఢులీ వ్యాళ ప్రవాళోర్మి కా

బక కారండవ చక్రముఖ్య జలసత్వ శ్రేణితో నింకినన్. ( 167 )


వ. అ య్యవసరంబున సముద్రుండు గరుణాసముద్రుం డగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి యెప్పటియట్లు నిలిపి, నలునిచే సేతువు బంధింపించి, త న్మార్గంబునం జని. ( 168 )


మ. పురముల్ మూఁడును నొక్కబాణమున నిర్మూలంబు గావించు శం

కరు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధ గో

పుర శాలాంగంణ హర్మ్య రాజభవన ప్రోద్య త్ప్రతోళీ కవా

ట రథాశ్వ ద్విప శస్త్రమందిర నిశాట శ్రేణితో వ్రేల్మిడిన్. ( 169 )


క. రావణు నఖిలజగ ద్వి, ద్రావణుఁ బరిమార్చి నిలిపె రక్షోవిభుఁ గా

రావణు ననుజన్ముని నై, రావణ సితకీర్తి మెఱసి రాఘవుఁ డెలమిన్. ( 170 )


సీ. ధర్మసంరక్షకత్వ ప్రభావుం డయ్యు ధర్మవిధ్వంసకత్వమునఁ బొదలి

ఖర దండ నాభిముఖ్యము పొంద కుండియు ఖరదండ నాభిముఖ్యమున మెఱసి

పుణ్యజనావన స్ఫూర్తిఁ బెంపొందియుఁ బుణ్యజనాంతక స్ఫురణఁ దనరి

సంత తాశ్రిత విభీషణుఁడు గాకుండియు సంతతాశ్రిత విభీషణత నొప్పి


తే. మించి తనకీర్తిచేత వాసించె దిశలు, తరమె? నుతియింప రాము నెవ్వరికినైనఁ

జారుతరమూర్తినవనీశ చక్రవర్తిఁ, బ్రకట గుణసాంద్రు దశరధ రామచంద్రు. ( 171 )


వ. అట్టి రామావతారంబు జగత్పావనంబు నస్మ త్ప్రసాదకారణంబునై నుతికెక్కె. ఇంక కృష్ణావతారంబు వివరించెద వినుము. ( 172 )


సీ. తాపసోత్తమ! విను దైత్యాంసములఁ బుట్టి నరనాథు లతుల సేనాసమేతు

లగుచు ధర్మేతరులై ధాత్రిఁ బెక్కు బాధల నలంచుటఁ జేసి! ధరణి వగలఁ

బొందుచు వాపోవ భూభార ముడుపుటకై హరి పరుఁడు నారాయణుండు

చెచ్చెరఁ దన సితాసిత కేశయుగమున బలరామ కృష్ణ రూపములఁ దనరి


తే. యదుకులంబున లీనమై నుదయ మయ్యె, భవ్యయశుఁడగు వసుదేవు ధార్యలైన

రోహిణియు దేవకియునను రూపవతుల, యందు నున్మ త్త దైత్యసంహారియగుచు. ( 173 )