పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

క. చిత్రముగ భరత లక్ష్మణ, శత్రుఘ్నుల కర్థి నగ్రజన్ముం డగుచున్

ధాత్రిన్ రాముఁడు వెలసెఁబ, విత్రుఁడు దుర్భవలతా లవిత్రుండగుచున్ ( 156 )


వ. అంత ( 157 )


సీ. కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ పద ఫాల భుజరద పాణి నేత్రఁ

గాహళ కరభ చక్ర వియ త్పులిన శంఖ జంఘేరు కుచ మధ్య జఘన కంఠ

ముకుర చందన బింబ శుక గజ శ్రీకార గండ గంధోష్ఠ వా గ్గమన కర్ణఁ

జంప కేందు స్వర్ణ శంపా ధను ర్నీల నాసికాస్యాంగ దృక్ భ్రూ శిరోజ


తే. నలి సుధావర్త కుంతల హాసనాభి, కలిత జనకావనీపాల కన్యకా ల

లామఁ బరిణయమయ్యె లలాటనేత్ర, కార్ముక ధ్వంస ముంకువ గాఁగ నతఁడు. ( 158 )


వ. అంత ( 159 )


క. రామున్ మేచక జలద, శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు

త్రామున్ దుష్ట నిశాట వి, రాముం బొమ్మనియెఁ బం క్తిరథుఁ డడవులకున్. ( 160 )


వ. ఇట్లు పంచిన, ( 161 )


చ. అరుదుగ లక్ష్మణుండు జనకాత్మ జయుం దనతోడ నేగుదే

నరిగి రఘూత్తముండు ముద మారఁగఁ జొచ్చెఁ దరక్షు సింహ సూ

కర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్ల కా

సర ముఖ వస్యసత్వచయ చండతరాటవి దండకాటవిన్. ( 162 )


క. ఆ వనమున వసియించి నృ, పావన నయశాలి యిచ్చెనభయములు జగ

త్పావన మునిసంతతికిఁ గృ, పావన నిధియైన రామభద్రుం డెలమిన్. ( 163 )


క. ఖర కర కుల జలనిధి హిమ, కరుఁడగు రఘురామ విభుఁడు గఱకఱితోడన్

ఖరుని వధించెను ఘన భీ, కర శరముల నిఖిల జనులు గర మరు దనఁగాన్. ( 164 )


క. హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని, హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్

హరి విభునకు హరిమధ్యను, హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై ( 165 )


వ. అంత సీతానిమిత్తంబునం ద్రిలోకకంటకుఁడగు దశకంఠుం దునుమాడుటకునై

కపిసేనా సమేతుండై చని దుర్గమంబైన సముద్రంబు తెరువు సూపకున్న నలిగి. ( 166 )