Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

113

తే. యర్థి రూపంబు గైకొని యడుగవలసె, ధార్మికుల సొమ్ము వినయోచితమునఁ గాని

వెడఁగుఁదనమున నూరక విగ్రహించి, చలన మందింపరాదు నిశ్చయము పుత్ర! ( 150 )


చ. బలి నిజమౌళి న వ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము

త్కలిక ధరించి తన్నును జగత్తృయమున్ హరి కిచ్చి కీర్తులన్

నిలిపె వసుంధరాస్థలిని నిర్భరలోక విభుత్వ హానికిన్

దలఁకక శుక్రు మాటలకుఁ దారక భూరి వదాన్య శీలుఁడై ( 151 )


వ. మఱియు న ప్పరమేశ్వరుండు నారదా! హంసావతారంబు నొంది యతిశయ భక్తి యోగంబున సంతుష్టాంతరంగుం డగుచు నీకు నాత్మతత్త్వ ప్రదీపకంబగు భాగవత మహాపురాణం బుపదేశించె. మన్వతారంబు నొంది స్వకీయ తేజ:ప్రభావంబున నప్రతిహతంబైన చక్రంబు ధరియించి దుష్టవర్తనులైన రాజుల దండింపుచు, శిష్ట పరిపాలనంబు సేయుచు, నాత్మీయ కీర్తిచంద్రికలు సత్యలోకంబున వెలిగించె. మఱియు ధన్వంతరి యన నవతరించి తన నామస్మరణంబున భూజనంబులకు సకల రోగ నివారణము సేయుచు నాయుర్వేదంబు గల్పించె. వెండియు పరశురామావతఅరంబు వినుము. ( 152 )


మ. ధరణీకంటకు లైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి వి

స్ఫురి తోదార కుఠార ధారఁ గలనన్ ముయ్యేడుమాఱుల్ పొరిం

బొరి మర్ధించి సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ

జిరకీర్తిన్ జమదగ్ని రాముఁ డన మించెన్ దాపసేంద్రోత్తమా ! ( 153 )


వ. మఱియు శ్రీరామావతారంబు సెప్పెద వినుము. ( 154 )


సీ. తోయజహిత వంశ దుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు

గమనీయ కోసల క్ష్మాభృ త్సుతాగర్భ శుక్తి సంపుట లస న్మౌక్తికంబు

నిజపాద సేవక వ్రజ దు:ఖ నిబిడాంధకార విస్ఫురిత పంక రుహ సఖుఁడు

దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగ ణాకర దేవతానోకహంబు


తే. చటుల దానవ గహన వైశ్వానరుండు, రావణాటోప శైల పురందరుండు

నగచు లోకోపకారార్థ మవతరించె, రాముఁడై చక్రి లోకాభిరాముఁడగుచు ( 155 )