పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109

సీ. ప్రకట రుచిప్రజాపతికిని స్వాయంభువుని కూఁతు రాకూతి యను లతాంగి

కర్థి జన్మించి సుయజ్ఞుండు నా నొప్పు నతఁడు దక్షిణ యను నతివయందు

సుయమ నామామర స్తోమంబుఁ బుట్టించి యింద్రుఁడై వెలసి యుపేంద్రలీల

నఖిల లోకంబుల యార్తి హరించిన నతని మాతామహుఁ డైన మనువు


తే. దన మనంబునఁ దచ్చరిత్రమున కలరి, పరమ పుణ్యుండు హరి యని పలికెఁగాన

నంచిత జ్ఞాన నిధియై సుయజ్ఞుఁ డెలమి దాపసోత్తమ! హరి యవతార మయ్యె. ( 117 )


వ. అని చెప్పి కపిలుని యవతారంబు వినుమని యిట్లనియె. ( 118 )


చ. ధృతమతి దేవహూతికిని దివ్యవిభుం డగు కర్ధమ ప్రజా

పతికిఁ బ్రమోదమొప్ప నవభామలతోఁ గపిలుండు పుట్టి యే

గతి హరిఁ బొందు నట్టి సుభగంబగు సాంఖ్యము తల్లికిచ్చి దు

ష్కృతములు వాపి చూపె మునిసేవితమై తనరారు మోక్షమున్. ( 119 )

వ. మఱియు దత్తాత్రేయావతారంబు వినుము. ( 120 )


సీ. తాపసోత్తముఁ డత్రి దనయుని గోరి రమేశు వేఁడిన హరి యేను నీకు

ననఘ! దత్తుఁడ నైతి నని పల్కు కతమున నతఁడు దత్తాత్రేయుఁడై జనించె

న మ్మహాత్ముని చరణాబ్జ పరాగ సందోహంబుచేఁ బూతదేహు లగుచు

హైహయ యదువంశు లైహి కాముష్మిక ఫలరూప మగు యోగబలము వడసి


తే. సంచిత జ్ఞానఫల సుఖైశ్వర్యశక్తి, శౌర్యములు పొంది తమ కీర్తిచదల వెలుఁగ

నిందు నందును వాసికి నెక్కి రట్టి, దివ్యతర మూర్తి విష్ణు నుతింపఁ దరమె! ( 121 )


వ. వెండియు సనకా ద్యవతారంబు వినుము. ( 122 )


సీ. అనఘాత్మ! నేను గల్పాదిని విశ్వంబు సృజియింపఁ దలఁచి యంచిత తపంబు

నర్థిఁజేయుచు *'సన' యని పలుకుటయు నది గారణంబున సనాఖ్యలను గల స

నందన సనక సనత్కుమార సనత్సుజాతులు నల్వురు సంభవించి

మానసపుత్రులై మహి నుతికెక్కిరి పోయిన కల్పాంతమున నశించి


తే. యట్టి యాత్మీయ తత్త్వంబు పుట్టఁజేసి, సాంప్రదాయిక భంగిని జగతినెల్ల

గలుగఁజేసిరి య వ్విష్ణుకళలఁ దనరి, నలువు రయ్యును నొక్కఁడె నయచరిత్ర! ( 123 )