పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

క. విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు, విశ్వమయుం డఖిలనేత విష్ణుం డజుఁ డీ

విశ్వములోఁ దా నుండును, విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్. ( 100 )


చ. అతని నియుక్తిఁ జెంది సచరాచర భూతసమేత సృష్టి నే

వితతముగా సృజింతుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ

పతి లయ మొందఁజేయు హరి పంక రుహోదరుఁ డాదిమూర్తి య

చ్యుతుఁడు త్రిశ క్తియుక్తుఁ డగుచుండు ని టింతకుఁ దాన మూలమై. ( 101 )


క. విను వత్స! నీవు న న్నడి, గిన ప్రశ్నకు నుత్తరంబు గేవల పరమం

బును బ్రహ్మం బీ యఖిలం, బున కగు నాధార హేతు భూతము సుమ్మీ! ( 102 )


క. హరి భగవంతుఁ డనంతుఁడు, గరుణాంబుధి సృష్టికార్య కారణ హేతు

స్ఫురణుం డ వ్విభుకంటెం, బరుఁ డన్యుడు లేఁడు తండ్రీ! పరికింపగన్. ( 103 )


సీ. ఇది యంతయును నిక్కమే బొంక నుత్కంఠ మతిఁ దద్గుణ ధ్యాన మహిమఁజేసి

పరికింప నే నేమి పలికిన నది యెల్ల సత్యంబు యగు బుధస్తుత్య! వినుము

ధీయుక్త! మామ కేంద్రియములు మఱచియుఁ బొరయ వసత్య విస్ఫురణమెందు

నదిగాక మత్తను వామ్నాయ తుల్యంబు నమరేంద్ర వందనీయంబు నయ్యెఁ

తే. దవిలి య ద్దేవదేవుని భవమహాబ్ధి, తారణంబును మంగళ కారణంబు

నఖిల సంపత్కరంబునై యలరు పాద, వనజమునకే నొనర్చెద వందనములు. ( 104 )


ఉ. ఆ నలినాక్షు నందనుఁడ నయ్యుఁ బ్రజాపతినయ్యు యోగ వి

ద్యానిపుణుండ నయ్యను బదంపడి మ జ్జనన ప్రకారమే

యేను నెఱుంగ న వ్విభుని యిద్ధ మహత్త్వ మెఱుంగ నేర్తునే!

కానఁబడున్ రమేశ పరికల్పిత విశ్వము గొంతకొంతయున్. ( 105 )


మ. విను వే యేటికిఁ దాపసప్రవర! యవ్విశాత్ముఁ డీశుండు దాఁ

దన మాయా మహిమాంతముం దెలియఁగాఁ దథ్యంబు దాఁ జాలఁ డ

నన్ను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునై

నను నిక్కం బెఱుగంగ జాలుదుమె! విజ్ఞాన క్రియాయుక్తులన్. ( 106 )


వ. ఆ మ్మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుం డంటేని, ( 107 )