పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101

వాసుదేవ వ్యత్తిరిక్తంబులేదు, సిద్ధంబు. ( నారాయణ నియమ్యంబులు లోకంబులు). దేవతలు నారాయణ శరీర సంభూతులు. వేద యాగ తపో యోగ గతి విజ్ఞానంబులు నారాయణపరంబులు. (జ్ఞానసాధ్యం బగు ఫలంబు నారాయణాధీనంబు). కూటస్థుండు, సర్వాత్మకుండు, సర్వద్రష్టయునైన యీశ్వరుని కటాక్ష విశేషంబున సృజియింపంబడి, ప్రేరితుండనై, సృజ్యంబైన ప్రపంచంబు సృజింపుచుండుదు. నిర్గుణుం డైన యీశ్వరుని వలన రజస్సత్త్వతమో గుణంబులు ప్రభూతంబులై యత్పత్తి స్థితి లయంబులకుఁ బాలుపడి, కార్యకారణ కర్తృత్వ భావంబులందు ద్రవ్యంబులైన మహాభూతంబులు, జ్ఞానమూర్తులైన దేవతలు, క్రియారూపంబులైన యింద్రియంబులు, నాశ్రయంబులుగా నిత్యముక్తుండయ్యును, మాయ సమన్వితుండైన జీవుని బంధించు. జీవులకు నావరణంబులై యుపాధిభూతంబులైన మూఁడు లింగంబులంజేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబు గల యీశ్వరుం డి వ్విధంబునం గ్రీడించుచుండు. ( 84 )


క. ఆ యీశుఁ డనంతుఁడు హరి, నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్

మాయకుఁ బ్రాణివ్రాతము, కేయెడలన్ లేదు నీశ్వ రేతరము సుతా! ( 85 )


వ. వినుము మాయావిభుండైన యీశ్వరుండు దన మాయంజేసి దైవయాగంబునం బ్రాప్తంబులైన కాల జీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి గైకొనియె. ఈశ్వరాధిష్త్హతంబైన మహత్తత్త్వంబు వలన ( నగు కాలంబున గుణ వ్యతికరంబును స్వభావంబునఁ బరిణామంబును, జీవాదృష్ట భూతంబైన కర్మంబున జన్మంబును నయ్యె. రజ స్సత్త్వంబులచే నుపబృంహితమై వికారంబు నొందిన మహాత్తత్త్వంబు వలనం) దమ:ప్రధానంబై ద్రవ్య జ్ఞానక్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అదియు రూపాంతరంబు నొంచుచు ద్రవ్య శక్తియైన తామసంబుఁ క్రియాశక్తియైన రాజసంబు, జ్ఞాన శక్తియైన స్వాతికంబును నన మూఁడు విధంబులయ్యె. అందు భూతాదియైన తామసాహంకారంబు వలన నభంబు గలిగె. నభంబునకు సూక్ష్మరూపంబుఁ ద్రష్టృ దృశ్యంబులకు బోధకం బైన శబ్ద్ంబు గుణం బగు. నభంబు వలన వాయువు గలిగె. వాయువునకుఁ బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగి యుండును. అది దేహంబునందుండుటం జేసి ప్రాణరూపంబై యింద్రియ మన శ్శరీరపాటవంబు లైన యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు.