99
మ. అవిరోధంబున నీవు న న్నడుగు నీ యర్థంబు మున్ బ్రహ్మ మా
ధవు చేతన్ విని నారదుం డడిగినన్ దథ్యంబుగాఁ జెప్పె మా
నవ లోకేశ్వర ! నారదుండు వెనుకన్ నాకుం బ్రసాదించె, సం
శ్రవణీయంబు మహాద్భుతంబు విను మా సందేహ విచ్ఛేదమున్. (71)
అధ్యాయము - 5
వ. నారదుండు బ్రహ్మ కిట్లనియె. ( 72 ).
మ.చతురాస్యుండపు వేల్పు పెద్దవు జగ త్సర్గానుసంధాయి వీ
శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్ధ సం
యుతమై సర్వము నీ కరామలకమై యుండుం గదా! భారతీ
సతి యిల్లా లఁట నీకు నో జనక! నా సందేహమున్ బాపవే! ( 73 )
శా. ప్రారంభాది వివేక మెవ్వఁడొసఁగున్? బ్రారంభ సంపత్తికా
ధారం బెయ్యది? యేమి హేతువు ? యదర్ధం బే స్వరూపంబు సం
సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగింతు వెల్లప్పుడున్
బారం బెన్నఁడు లేదు నీమనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా! ( 74 )
శా. నాకుం జూడఁగ నీవు రాజ వనుచున్నాఁడన్ యథార్థస్థితిన్
నీ కంటెం ఘనుఁడొక్క రాజు గలఁడో నీ వింతకున్ రాజవో
నీ కే లాభము రాఁదలంచి జగముల్ నిర్మించె దీ చేతనా
నీకం బెందు జనించు నుండు నణఁగున్ నిక్కంబు భాషింపుమా. ( 75 )
మ.సదస త్సంగతి నామ రూప గుణ దృశ్యంబైన విశ్వంబు నీ
హృదధీనంబు గదా! ఘనుల్ సములు నీ కెవ్వారునున్ లేరు నీ
పద మత్యున్నత మిట్టి నీవు తపముల్ ప్రావీణ్య యుక్తుండవై
మది నే యీశ్వరుఁ గోరి చేసితివి త న్మార్గంబు సూచింపవే. ( 76 )