పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

మ. తపముల్ సేసిననో మనోనియతినో దానవ్రతప్రీతినో

జపమంత్రంబులనో శ్రుతిస్మృతులనో సద్భక్తినో యెట్లు ల

బ్ధపదుండౌ నని రుద్ర ముఖరుల్ భావంతు రెవ్వాని న

య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుం డౌఁ గాక నా కెప్పుడున్. (64)


క. శ్రీపతియు యజ్ఞపతియుఁ బ్ర, జాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్

భూపతియు యాదవ శ్రే, ణీపతియుం గతియు నైన నిపుణు భజింతున్. (65)


మ. అణువో కాక కడు న్మహావిభవుఁడో యచ్ఛిన్నుఁడో ఛిన్నుఁడో

గుణియో నిర్గుణియో యటంచు విబుధుల్ గుంఠీభవ త్తత్త్వ మా

ర్గణులై యే విభు పాదపద్మ భజనోత్కర్షంబులన్ దత్త్వవీ

క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము సేవించెదన్. (66)


మ. జగ దుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే

భగవంతుండు సరస్వతిం బనుప నా పద్మాస్య దా నవ్విభున్

మగనింగా వరియించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టిపా

రగుఁ జేసెన్ మును బ్రహ్మ నట్టి ఘను నారంభింతు సేవింపఁగన్. (67)


సీ. పూర్ణుఁ డయ్యును మహాభూత పంచక యోగమున మేనులను బురములు సృజించి

పురములలోనుండి పురుష భావంబున దీపించు నెవ్వఁడు ధీరవృత్తిఁ

బంచభూతములను బదునొకం డింద్రియములఁ బ్రకాశింపించి భూరిమహిమ

షోడశాత్మకుఁ డన శోభిల్లి జీవత్వనృత్య వినోదంబు నెఱుపుచుండు

తే. నట్టి భగవంతుఁ డవ్యయుఁ డచ్యుతుండు, మానసోదిత వాక్పుష్ప మాలికలను

మంజు నవరస మకరంద మహిమ లుట్ట, శిష్ట హృద్భావలీలలఁజేయుగాత. (68)

ఉ. మానధనుల్ మహాత్ములు సమాధినిరూఢులు యన్ముఖాంబుజ

ధ్యాన మరంద పానమున నాత్మభయంబులఁ బాపి ముక్తులై

లూనత నొందు రట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటా

జ్ఞాన తమో నభోమణికి సాధుజనాగ్రణి కేను మ్రొక్కెదన్. (69)


వ. అని యిట్లు హరి వందనంబు సేసి శుకయోగీంద్రుం డిట్లనియె. (70)