97
మ. పరుఁడై యీశ్వరుఁడై మహామహిముఁడై ప్రాదుర్భవ స్థాన సం
హరణ క్రీడనుఁడై త్రిశక్తి యుతుఁడై యంతర్గత జ్యోతియై
పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ బ్రాపింప రాకుండు దు
స్తర మార్గంబునఁ దేజఱిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్.(58)
వ. మఱియు సజ్జన దురిత సంహణుండును, దుర్జన నివారకుండును, నఖిల సత్త్వ రూపకుండును, పరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయ కమల కర్ణికా
మధ్యదీపకుండును, సాత్వత శ్రేష్ఠుండును, పరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీన జన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూప
బ్రహ్మ విహారుండును నౌయప్పరమేశ్వరునకు నమస్కరించెద. (59)
ఉ. ఏ విభు వందనార్చనము లే విభు చింతయు నామకీర్తనం
బే విభు లీల లద్భుతము లెవ్వని సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే
నా విభు నాశ్రయించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. (60)
ఉ. ఏ పరమేశు పాదయుగ మెప్పుడుఁ గోరి భజించి నేర్పరుల్
లోపలి బుద్ధిలో న్నుభయలోకము లందుల సక్తిఁ బాసి యే
తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్.(61)
చ. తపములు సేసియైన మఱి దానము లెన్నియుఁ జేసియైన నే
జనములు సేసియైన ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
యపదములై దురంత విప దంచిత రీతిగ నొప్పుచుండు న
య్యపరిమితున్ భజించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. (62)
మ. యవన వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సం
భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి భా
గవత శ్రేష్ఠుల డాసి శుద్ధతనులన్ గల్యాణులై యుందు రా
యనికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్.(63)