పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ఆ. హరి పద తులసీదళ మోదరతి లేని, ముక్కు పందిముక్కు మునిచరిత్ర !

గరుడగమను భజనగతి లేని పదములు, పాదపముల పాదపటల మనఘ ! (50)


సీ. నారాయణుని దివ్య నామాక్షరములపైఁ గరఁగని మనములు గఠిన శిలలు

మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై యుండని మేను మొద్దు

చక్రికి మ్రొక్కని జడుని యౌఁదల నున్న కనక కిరీటంబు కట్టె మోఁపు

మాధవార్పితముగా మనని సిరి వన దుర్గ చంద్రికావైభవంబు

ఆ. కైటభారి భజన గలిగి యుండని వాఁడు, గాలిలోననుండి కదలు శవము

కమలనాభు పదము గనని వాని బ్రతుకు, పసిఁడికాయలోని ప్రాణిబ్రతుకు. (51).

అధ్యాయము - 4

వ. అని యిట్లు పలికిన వైయాసి వచనంబుల నౌత్తరేయుండు గందళిత హృదయుండై నిర్మలమతి విశేషంబున, (52)


ఆ. సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి యి, ల్లాలి విడిచి పశు గృహాళి విడిచి

రాజు హృదయ మిడియ రాజీవనయనుపై, ధనము విడిచి జడ్డుఁదనము విడిచి. (53)


వ. ఇట్లు మృత్యుభయము నిరిసించి, ధర్మార్థకామంబులు సన్యసించి, పురుషోత్తమునందుఁ జిత్తంబు వివ్యసించి, హరిలీలా లక్షణంబు లుపన్యసింపు మను తలంపున

నరేంద్రుఁ డిట్లనియె.(54)


క. సర్వాత్ము వాసుదేవుని, సర్వజ్ఞుఁడవైన నీవు సంస్తుతిసేయన్

సర్వభ్రాంతులు వదలె మ, హోర్వీసురపర్య ! మానసోత్సవ మగుచున్.(55)


సీ. ఈశుండు హరి విష్ణుఁ డీ విశ్వమంతయుఁ బుట్టించు రక్షించు, బొలియఁజూచు

బహు శక్తియుతుఁ భగవంతుఁ డవ్యయు డాది నే శక్తుల నాశ్రయించి

బ్రహ్మ శక్రాది రూపముల వినోదించెఁ గ్రమముననో యే కాలముననొ

ప్రకృతిగుణంబులఁ బత్తి గ్రహించుత యేకత్వమున నుండు నీశ్వరుండు.

ఆ. భిన్న మూర్తి యగుచుఁ బెక్కువిధంబుల, నేల యుండు నతని కేమి వచ్చె

నుండకున్నఁ దాపసోత్తమ ! తెలుపవే ! వేడ్కతోడ నాకు వేదవేద్య ! (56)


వ. అనిన నుత్తరానందను వచంబులకు నిరుత్తరుండు గాక సదుత్తర ప్రదాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపపోత్తముండు దన మనంబున. (57)