Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89

అధ్యాయము - 2

మ. బహువర్షంబులు బ్రహ్మ తొల్లి జగ ముత్పాదింప విన్నాణి గా

క హరిప్రార్థన ధారణా వశమునం గాదే; యమూఢోల్లస

న్మహనీయోజ్జ్వల బుద్ధియై భువన నిర్మాణ ప్రభావంబునన్

విహరించె న్నరనాథ ! జంతునివహావిర్భావ నిర్ణేతయై. (19)


వ. విను మూఢుండు శబ్దమయ వేదమార్గంబైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబుల నిచ్ఛయించు. మాయామయ మార్గంబున

వాసనామూలంబున ( సుఖంబని తలంచి) నిద్రించువాఁడు కలలు గను తెఱంగునం బరిభ్రమించు, నిరవద్య సుఖలాభంబును జెందఁడు. తన్నిమిత్తంబున విద్వాంసుండు

(నామ మాత్ర సారంబులగు) భోగ్యంబులలోన నెంతట దేహనిర్వహణంబు సిద్ధించు నంతియ కైకొనుచు నప్రమత్తుండై సంసారంబు సుఖమని నిశ్చయింపక యొండు

మార్గంబున సిద్ధి గలదని చూచి పరిశ్రమంబు నొందకుండు. (20)


సీ. కమనీయ భూమి భాగముల లేకున్నవే ? పడియుండుటకు దూది పఱుపు లేల ?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే ? భోజన భాజన పుంజ మేల ?

వల్కలాశాజినావళులు లేకున్నవే ? కట్ట దుకూల సంఘాత మేల ?

గొనకొని వసియింప గుహలు లేకున్నవే ? ప్రాసాద సౌధాది పటల మేల ?

తే. ఫల రసాదులు గుఱియవే ? పాదపములు, స్వాదుజలములు నుండువే ? సకల నదులుఁ

బొసఁగ భిక్షయుఁ బెట్టరే ? పుణ్యసతులు, ధనమదాంధుల కొలువేల ? తాపసులకు. (21)


క. రక్షకులు లేనివారల, రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్

రక్షింపు మనుచు నొక నరు, నక్షముఁ బ్రార్థింపనేల ? యాత్మజ్ఞునకున్ (22)


వ. అని యిట్లు స్వతస్సిద్ధుండు, నాత్మయు, నిత్యండును, సత్యుండును, భగవంతుండునైన వాసుదేవుని భజియించి తదీయ సేవానుభవానందంబున సంసార హేతువగు

నవిద్యచే బుద్ధిమంతుండు విడువంబడుం గావున. (23)