Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

బ్రహ్మపదంబు తాలువులు జలంబు, జిహ్వేంద్రియంబు రసంబు, భాషణంబులు సకలవేదంబులు, దంష్ట్రలు దండధరుండు, దంతంబులు పుత్రాది

స్నేహకళలు, నగవులు జనోన్మాద కారిణియగు మాయ, కటక్షంబులు దురంత సంసర్గంబులు, పెదవులు వ్రీడాలోభంబులు, స్తనంబులు ధర్మంబు, వెన్నధర్మమార్గంబు,

మేఢ్రంబు ప్రజాపతి వృషణంబులు విత్రావరుణులు, జఠరంబు సముద్రంబులు, శల్యసంఘంబులు గిరులు, నాడీ నివహంబులు నదులు, తనూరుహంబులు తరువులు,

నిశ్వాసంబులు వాయువులు, * కాలంబు గమనంబు, కర్మంబులు నానావిధ జంతుసన్నివహ సంవృత సంసరణంబులు, శిరోజంబులు మేఘంబులు, కట్టు పుట్టంబులు

సంధ్యలు, హృదయంబు ప్రధానంబు సర్వవికారంబులకు నాశ్రయభూతంబైన మనము చంద్రుండు, చిత్తంబు మహత్తత్వంబు, అహంకారంబు రుద్రుండు, అశ్వాశ్వతర్యుష్ట్ర

గజంబులు నఖంబులు, కటిప్రదేశంబు పశు మృగాదులు, విచిత్రంబలె న యాలాపనైపుణ్యంబులు పక్షులు, బుధ్ది మనువు, నివాసంబు పురుషుండు, షడ్జాదులయిన

స్వరవిశేషంబులు గంధర్వ విద్యాధాత సిద్ధ చారణాప్సర స్సమూహంబులు, స్మృతి ప్రహ్లాద ప్రముఖులు, వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు. మఱియు

నమ్మహావభునకు ముఖంబు బ్రాహ్మణులు, భుజంబులు క్షత్త్రియులు, ఊరులు వైశ్యులు, చరణంబులు శూద్రులు, నామంబులు నానావిధంబులైన వసు రుద్రాది

దేవతాభిధానంబులు, ద్రవ్యంబులు హవిర్భాగంబులు, కర్మంబులు యజ్ఞప్రయో గంబులు. ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబున ముముక్షుండైన వాఁడు

మనస్సంధానంబు సేయవలయునని చెప్పి వెండియు నిట్లనియె. (16)


క. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయను పనిలేదా

హరిమయము గానిద్రవ్యము, పరమాణువు లేదు వంశపావన ! వింటే. (17)


సీ. కలలోన జీవుండు కౌతుహలంబునఁ బెక్కు దేహంబులఁ బేరు వడసి

యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి

నఖిలాంతరాత్మకుఁ డగు పరమేశ్వరుఁ డఖిల జంతుల హృదయములనుండి'

బుద్ధివృత్తులనెల్ల బోద్ధయై వీక్షించు బంధబద్ధుఁడు కాఁడు ప్రాభవమున.


తే. సత్యుఁ డానందబహుళ విజ్ఞానమూర్తి, యతని సేవింప నగుఁ గాక యన్య సేవఁ

గలుగు నేఅవు కైవల్య గౌరవములు, పాయ దెన్నఁడు సంసార బంధ మధిప ! (18)