పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72


ఆ. ధర్మమూర్తి నయ్య ! ధర్మజ్ఞ ! వృషరూప ! పరమధర్ము వీవు పలుకు త్రోవ

పాపకర్మి సేయు పాపంబు సూచింపఁ, బాపకర్ముఁ డేగు పథకము వచ్చు. (425)


వ. మఱియు దేవమాయవలన భూతంబుల వాజ్మనంబులకు పథ్యఘాతుక లక్షణ వృత్తి సులభంబునం దెలియరాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగమునం దపశ్శౌచదయా సత్యంబులు నాలుగును నీకుం పాదంబు లని చెప్పుదురు. ( త్రేతాయుగంబునఁ బూర్వోక్త పాదచతుష్కంబునఁ గ్రామంబునం దప శ్శౌచ దయా సత్యంబులం దురీయపాదంబు క్షీణంబయ్యె. ద్వాపరంబునం బాదద్వయంబు నశించె. కలి యుగంబునందు నివ్వడువునన యిప్పుడు నీకుఁ ) బాదద్వయంబు భగ్నంబయ్యె. అవశిష్టంబుగు భగదీయ చతుర్థపాదంబు నధర్మంబు గల్యంతమున నిగ్రహింప గమనించుచున్నది విను మదియునుంగాక . (426)


మ. ధర్మముం బాపి రమావిభుండు గరుణం బాదంబులం ద్రొక్కఁగా

స్థిరమై వేడుక నింతకాలము సుఖశ్రీ నొంది భూదేవి త

చ్చరణస్పర్శము లేమి శూద్రకులజుల్ శాసింతు రంచు న్నిరం

తర శోకంబున నీరు గన్నుల నిడెన్ ధర్మజ్ఞ ! వీక్షించితే ? (427)

పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపరిపాలనంబు సేయుట

వ. అని యిట్లు ధర్మ భూదేవతల బుజ్జగించి మహారథుండైన విజయపౌత్రుండు గ్రొక్కాఱు మెఱుంగు చక్కఁదనంబు ధిక్కరించి, దిక్కులకు వెక్కసంబైన యడిదంబు బెడిదంబు ఝళిపించి, పాపహేతువైన కలి రూపమాప నుద్యోగించిన, వాఁడు రాజరూపం బుడిగి, వాడిన మొగంబుతోడ భయవిహ్వలుండై హస్తంబుసాఁచి తత్పాదమూల విన్యస్తమస్తకుండై ప్రణామంబు సేసి, (428)


క. కంపించె దేహమెల్లం, జంపకు మో రాజితిలక ! శరణాగతు ర

క్షింపు మని తనకు మ్రొక్కినఁ, జంపక కలిఁ జూచి నగుచు జనపతి పలికెన్ (429)


క. అర్జునకీర్తి సమేతుం డర్జునపౌత్రుండు భయరసావృతజనులన్

నిర్జతులఁ జంప నొల్లఁడు, దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా ! (430)


వ. నీవు పాపబంధుండవు. మదీయ బాహుపాలితంబైన మహీమండలంబున నిలువ వలదు. రాజదేహంబునందు వర్తించు నిన్ను నసత్య లోభ చౌర్య దౌర్జన్య