పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67


సీ. మనువు నిత్యముగాదు మరణంబు నిజమని యెఱిఁగి మోక్షస్థితి నిశ్చయించు

నల్పాయువులము మా కన్య దుర్జన చరిత్రము లోలిఁ గర్ణ రంధ్రములఁ బెట్టి

బంగారు వంటి యీ బ్రతికెడి కాలంబు వోనాడఁగా నేల ? పుణ్యచరిత !

మాధవ పదపద్మ మకరందపానంబు సేయింపవే ! యేము సేయునట్టి .

ఆ. సత్త్రయాగమునకు సన్మునీంద్రు సీర, వాఁడె దండధరుఁడు వచ్చెఁ జూడు

చంపఁ డొకనినైన జన్న మయ్యెడు దాఁక, వినుచునుండుఁ దగిలి విష్ణుకథలు. (391)


క. మందునకు మందబుద్ధికి, మందాయువునకు నిరర్థ మార్గునకును గో

విందు చరణారవింద మ, రందముఁ గొనఁ దెఱపిలేదు రాత్రిం బవలున్. (392)


వ. అని శౌనకుడు పలికిన సూతుం డిట్లనియె. పరీక్షిన్నరేంద్రుడు నిజవాహినీ సందోహి సంరక్షితంబగు ( కురుజాంగల) దేశంబునం (గలి ప్రవేశంబు నాకర్ణించి యుద్ధకుతూహలత) నంగీకరించి, యెక్కనాఁడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని నీల నీరదనిభ తురంగ నివహ యోజితంబును, ఫలిత మనోరథంబునైన రథంబు నారోహణంబుచేసి, మృగేంద్ర ధ్వజంబు వెలుంగ, రథకరి తురంగ సుభట సంఘటిత చక్రంబు నిర్వక్రంబునం గొలువ, దిగ్విజయార్థంబు వెడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబులైన యిలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భద్రాశ్వ, కేతుమాల, భారత వర్షంబులు,నుత్తరకురుదేశంబులును జయించి (పుష్కల ధనప్రదాన పూర్వకలగు సపర్యల నభ్యర్చితుండై) తత్తదేశ మంగళపాఠక సంఘాత జేగీయమాన పూర్వరాజ వృత్తాంతంబు లాకర్ణింపుచు, పాఠకపఠత పద్యంబులందుఁ బాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుం డాచరించిన సారథ్య సఖ్య సభాపతిత్వ సాచివ్య రచన వీరాసన దూతభావాది కర్మంబులు, నశ్వత్థామాస్త్రతేజంబు వలనఁ దను రక్షించుటయు, యాదవ పాండవుల స్నేహానుబంధబును, వారలకుం గలిగిన భగవద్భక్తివిశేషంబును విని, యాశ్చర్యంబు నొందుచు, ( వంది బృందంబులకు మహాధనంబులు, హారాంబరాభరణ సందోహంబులు నొసంగుచుఁ ) బద్మ నాభ పాదపద్మ భజన పరతంత్ర పవిత మానసుండై యొండె. అయ్యెడ వృషభ రూపంబున నేకపాదంబున సంచరించు ధర్మదేవుండు, దన సమీపంబున లేఁగ లేని లేఁగటికుఱ్ఱి చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు గురియుచు, గోరూపయై యున్నధాత్ర కిట్లనియె . (393)