పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61


శా. మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో

సన్నాహంబునఁ గాలకేయుల వడిం బక్కాడుచోఁ బ్రాభవ

స్కన్నుండై చనుకౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచోఁ

గన్నీ రెన్నఁ డుఁ దేవు తండ్రి ! చెపుమా ! కల్యాణమే ? చక్రికిన్. (350)


వ. అదియునుం గాక. (351)


క. ఓడితివో శత్రువులకు, నాడితివో సాధు దూష ణాలాపంబుల్

గూడితివో పరసతులను, వీడితివో మానధనము వీరుల నడుమన్. (352)


క. తప్పితివో ? యిచ్చెద నని, చెప్పితివో ? కపటసాక్షి, చేసిన మేలుం

దెప్పితివో ? శరణార్థుల, రొప్పితివో ! ద్విజులఁ బసుల రోగుల సతులన్. (353)


క. అడిచితివో ?భూసురులనఁ గుడిచితివో ? బాల వృద్ద గురువిలు వెలిగా

విడిచితివో ? యాశ్రితులను, ముడిచితివో ? పరల విత్తములు లోభమునన్. (354)

అధ్యాయము - 15

వ. అని పలికినం గన్నీరు కరతలమునం దుడిచికొనుచు, గద్గదస్వరంబున మహానిధిఁ గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పుల నిగుడింపుచు, నర్జునుండన్న కిట్లనియె. (355)


క. మనసారథి, మన సచివుడు మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుఁడున్

మన విభుఁడు, గురువు, దేవర మనలను దిగనాడి చనియె, మనజాధీశా ! (356)


క. కంటకపు నృపులు సూడఁగ మింటం గంపించు యంత్రమీనముఁ గోలన్

గెంటించి మనము వాలుం, గంటిం జేకొంటి మతని కరణన కాదే ! (357)


క. దండి ననేకులతో నా, ఖండలుఁ డెదురైన గెలిచి భాండవ వనముం

జండార్చికి నర్పించిన, గాండీవము నిచ్చెఁ జక్రి గలుగుటఁ గాదే ? (358)


క. దిక్కుల రాజుల నెల్లను, మక్కించి ధ్నంబు గొనుట, మయకృతసభ ము

న్నెక్కుట, జన్నము సేయుట, నిక్కము హరి మనకు దండ నిలిచినఁగాదే ? (359 )


మ. ఇభజిద్వీర్య ! మఖాభిషిక్తమగు నీ యుల్లాలి ధమ్మిల్లమున్

సభలో శాత్రవు లీడ్చినన్ ముడువ కా చంద్రాస్య దుఃఖింపఁగా

నభయం బిచ్చి ప్రతిజ్ఞచేసి భవదీయారాతికాంతా శిరో

జ భరశ్రీలు హరింపఁడే ? విధవలై సౌభాగ్యముల్ వీడఁగన్. (360)