55
వ. అని విదురుండు ధృతరాష్ట్రునకు విర క్తిమార్గం బుపదేశించిన నతండు, ప్రజ్ఞాచక్షుండై సంపారంబు దిగనాడి, మోహపాశంబులవలన నూడి, విజ్ఞసమార్గంబునం గూడి, దుర్గమంబుగు హిమవన్నగంబునకు నిర్గమించిన. (1-314)
శా. అంధుడైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ
బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమ ప్రఖ్యాతయై యున్న త
ద్గాంధార ఝితినాథు కూఁతురును యోగప్రీతి చిత్తంబులో
సంధిల్లం బతివెంట నేఁగె నుదయ త్సాధ్వీగూణారుఢయై. (1-315)
చ. వెనుకకు రాక చుచ్చు రణవీరునఇకైవడి రాజదండనం
బునకు భయంబులేక వడిఁ బోయెడు ధీరునిభంగి నప్పు డా
వనిత దురంతమైన హిమవంతముపొంత వనాంతభూమికిం
బెనిమిటితోడ నించుకయు భీతివహింపక యేగెఁ బ్రీతితోన్. (1-316)
వ. ఇట్లు విదురసహితులై గాధారీధృతరాష్ట్రులు వనంబునకుం జనిన, మఱునాఁడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు చేసి, నిత్యహోమంబులు గావించి,బ్రహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబు లిచ్చి, నమస్కరించి, గురువందనంబు కొఱకుఁ బూర్వప్రకారంబునం దండ్రి మందిరంబునకుం జని యందు విదురసహితులైన తల్లిదండ్రులం గానక మంజు పీఠంబునం గూర్చున్న సంజయున కిట్లనియె.(1-317)
సీ. మా తల్లిదండ్రులు మందిరంబున లేరు సంజయ! వా రెందుఁ జనిరొ నేఁడు
ముందఱ గానఁడు ముసలి మా పెదతండ్రి, పుత్రశోకంబునఁ బొగులుఁ దల్లి
సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి, మందబుద్ధులమైన మమ్ము విడిచి
యెందుఁబోయిరొ? మువ్వరెఱిఁగింపు గంగలోఁ దన యపరాధంబుఁదడవికొనుచు
ఆ. భార్యతోడఁ దండ్రి పరితాపమునఁ బడుఁ గపట మింత లేదు,కరుణగలదు
పాండు భూవిభుండు పరలోకగతుఁడైన, మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు. (1-318)
వ. అనిన సంజయుండు (దయాస్నేహంబులనతికర్శితుండగుచు తన ప్రభువు పోయిన తెఱం గెఱుంగక కొంతదడ పూరకుండి) త ద్వియోగదుఃఖంబునఁ గన్నీరు కరతలంబునఁ దుడిచికొనుచు, బుద్ధిబలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు సేసి (తన భర్తృపాదంబుల మనంబున నెన్నుచు) ధర్మజున కిట్లనియె. (1-319)