పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54


ఆ. మేలు చెప్పెనేని మేలండ్రు లోకులు, చేటు చెప్పెనేని చెట్టయండ్రు

అంతమీఁద శూద్రుఁ డైన కతంబున శిష్టమరణ మతఁడు సెప్పఁ డయ్యె.(1-304)


వ. అది యెట్లనిన మాండవ్య మహాముని శాపంబునం దొల్లి యముండు శూద్రయోనియందు విదురుండై జన్మించియున్న నూఱుసంవత్సరంబు లర్యముండు యథాక్రమంబునం బాపకర్ముల దండించె. ఇట యుధిష్థిరుండు రాజ్యంబుఁ గైకొని లోకపాల సంకశులైన తమ్ములుం దానును కులదీపకుండైన మనుమని ముద్దుసేయుచుఁ బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండె.(1-305)


క. బాలాజన శాలా ధన, లీలా వనముఖ్య విభవ లీన మనీషా

లాలసులగు మానవులను, గాలము వంచించు దురవగాహము సుమతీ! (1-306)


వ. అది నిమిత్తంబునం గాలగతి యెఱింగి విదిరుండు ధృతరాష్ట్రున కిట్లనియె. (1-307)

గాంధారీ ధృతరాష్ట్రులు దేహత్యాగము సేయుట

మ. కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం

గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నేకాలంబు దుర్లంఘ్యమై

యనివర్యస్థితిఁ జంపు నట్టి నిరుపాయం బైన కాలంబు వ

చ్చె నుపాంతంబున మాఱు దీనికి మదిన్ జింతింపు ధాత్రీశ్వరా! (1-308)


శా. పుట్టంధుండువు, పెద్దవాఁడవు, మహాభోగంబులూ లేవు, నీ

పట్టెల్లంజెడిపోయె, దుస్సహ, జరాభారంబు పైఁ గప్పె, నీ

చుట్టా లెల్లను బోయి రాలు మగఁడున్ శోకంబునన్ మగ్నులై

కట్టా! దాయలపంచ నుండఁ దగవే, కౌరవ్యవంశాగ్రణీ! (1-309)


క. పెట్టితిరి చిచ్చు గృహమునఁ, బట్టితిరి తదీయభార్యఁ, బాడడవులకుం

గొట్టితిరి, వారు మనుపఁగ, నెట్టైన భరింపవలెనే? యీ ప్రాణములన్. (1-310)


క. బిడ్డ లకు బుద్ధిసెప్పని, గ్రుడ్డికిఁ బిండింబు వండికొని పొం డిదె పైఁ

బడ్డాఁ డని భీముం డొఱ, గొడ్డెము లాడంగఁ గూడుఁ గుడిచెద వధిపా. (1-311)


క. కనియెదవో బిడ్డల నిఁక, మనియెదవో తొంటికంటె మనుమలమాటల్

వినియెదవో యిచ్చెద ర, మ్మనియెదవో దానములకు నవనీసురులన్. (1-312)


క.దేహము నిత్యము గాదని, మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై

గేహము వెలువడు నరుడు, త్సాహముతోఁ జెందు ముక్తిసంపద ననఘా! (1-313)