Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

క.

బంధులు పౌరులు దెచ్చిన

గంధేభ హయాదు లైన కానుకలు దయా

సింధుఁడుఁ గైకొనె నంబుజ

బంధుఁడు గొను దత్త దీపపంక్తుల భంగిన్‌. 245


వ.

ఇట్లాత్మారాముండు పూర్ణకాముండు నైన యప్పరమేశ్వరునికి నుపాయనంబు

లిచ్చుచు నాగరులు వికసిత ముఖులై గద్గద భాషణంబులతోడ డయ్యకుండ

నడపు నయ్యకు నెయ్యంపుఁ జూపుల నడ్డంబులేని బిడ్డలచందంబున మ్రొక్కి

యిట్లనిరి. 246


శా.

నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా! నీ సేవ సంసార సం

తాప ధ్వంసినియౌఁ గదా! సకల భద్రశ్రేణులం బ్రీతితో

నాపాదింతు గదా! ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబుని

ర్వ్యాపారంబు గదయ్య! చాలరుగదా! వర్ణింప బ్రహ్మాదులున్‌. 247


క.

ఉన్నారము సౌఖ్యంబున

విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్‌

మన్నారము ధనికులమై

కన్నారము తావక్రాంఘి కమలములు హరీ! 248


క.

ఆరాటము మది నెఱుఁగము

పోరాటము లిండ్లకడలఁ బుట్టవు పురిలోఁ

జోరాటన మెగయదు నీ

దూరాటన మోర్వలేము తోయజనేత్రా! 249


ఉ.

తండ్రులకెల్లఁ దండ్రియగుఁ ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా

తండ్రివి తల్లివిం బతివి దైవమవు¦ సఖివి¦ గురుండ వే

తండ్రులు నీక్రియం బ్రజల ధన్యులఁ జేసిరి? వేల్పులైన నో

తండ్రి! భవ న్ముఖాంబుజము ధన్యతఁ గానరు మా విధంబున¦. 250


క.

చెచ్చెరఁ గరినగరికి నీ

విచ్చేసిన నిమిషమైన వేయ్యేండ్లగు నీ

వెచ్చోటికి విచ్చేయక

మచ్చికతో నుండుమయ్య! మా నగరమునన్‌. 251


ఆ.

అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ

జనిన నంధమైన జగము భంగి

నిన్నుఁ గానకున్న నీరజలోచన!

యంధతమస మతుల మగుదుమయ్య! 252


వ.

అని యిట్లు ప్రజ లాడెడి భక్తియుక్త మధుర మంజులాలాపంబులు గర్ణకలా

పంబులుగా నవధరించి, సకరుణావలోకనంబులు వర్షించుచు హర్షించుచుం

దనరాక విని మహానురాగంబున సంరంభ వేగంబుల మజ్జన భోజన శయనాది

కృత్యంబు లొల్లక, యుగ్రసేనాక్రూర వసుదేవ బలభద్ర ప్రద్యుమ్న సాంబ