42
యింద్రుండును బోలెఁ జతుస్సాగర వేలాలంకృతంబగు వసుంధరా మండలంబు సహోదర సహాయుండై యేలుచుండె. (1-230)
సీ. సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గుఱియించు, నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు, ఫలవంతములు లతాపాదపములు
పండు సస్యములు దప్పక ఋతువులనెల్ల, ధర్మమెల్లెడలను దనరి యుండు
దైవభూతాత్మతంత్రములగు రోగాది, భయములు సెందవు ప్రజలకెందు
ఆ.వె. గురుకులోత్తముండు కుంతీతనూజుండు, దానమానఘనుఁడు ధర్మజుండు
సత్యవాక్యధనుఁడు సకల మహీరాజ్య, విభవభాజియైన వేళయందు. (1-231)
వ. అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయు కొఱకును, సుభద్రకుం బ్రియంబు సేయు కొఱకును గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయందలంచి ధర్మనందనునకుం గృతాభివందనుండగుచు నతనిచే నాలింగితుండై యామంత్రణంబు వడసి కొందఱు తనకు నమస్కరించినం గౌఁగలించుకొని, కొందఱు తనుం గౌఁగిలింప నానందించుచు రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు, ద్రౌపదియుఁ , గుంతియు నుత్తరయు, గాంధారియు, ధృతరాష్ట్రుండును, విదురుండును, యుధిష్ఠిరుండును, యుయుత్సుండును, గృపాచార్యుండును నకుల-సహదేవులును, వృకోదరుండును, ధౌమ్యుండును (సత్సంగంబు వలన ముక్త దుస్సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువనోపఁ డట్టి) హరితోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబుల వలన నిమిషమాత్రంబును హరికి నెడలేనివారలైన పాండవులం గూడికొని, హరి మఱలవలెనని కోరుచు హరి సనిన మార్గంబుఁ జూచుచు, హరివిన్యస్తచిత్తులై లోచనంబుల బాష్పంబులొలుక నంతనంత నిలువంబడిరి. అయ్యవసరంబున. (1-232)
సీ. కనక సౌధములపైఁ గౌరవ కాంతలు, కుసుమ వర్షంబులు కోరి కుఱియ
మౌక్తిక దామ సమంచిత ధవళాత,పత్త్రంబు విజయుండు పట్టుచుండ
నుద్ధవ సాత్యకు లుత్సాహవంతులై, రత్నభూషిత చామరములు వీవ
గగనాంతరాళంబుఁ గప్పి కాహళభేరి, పణవ శంఖాది శబ్దములు మొరయ
ఆ.వె. సకల విప్ర జనులు సగుణ నిర్గుణ రూప, భద్రభాషణములు పలుకుచుండ
భువనమోహనుండు పుండరీకాక్షుండు, పుణ్యరాశి హస్తిపురము వెడలె. (1-233)