41
ఆ.వె. మునులు నృపులు సూడ మును ధర్మజుని సభా, మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది, దేవుఁడమరు నాదు దృష్టియందు. (1-224)
మ. ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుండు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్ఠింతు శుద్ధుండనై. (1-225)
వ. అని యిట్లు మనో వాగ్దర్శనంబులం బరమాత్మ యగు కృష్ణుని హృదయంబున నిలిపికొని ని:శ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దినావసానంబున విహంగంబు లూరకయుండు తెఱంగున నుండిరి. దేవమానవ వాదితంబులై దుందుభి నినదంబులు మొరసె. సాధుజన కీర్తనంబులు మెఱసె. కుసుమ వర్షంబులు గుఱిసె. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి (ముహూర్తమాత్రంబు దు:ఖితుండయ్యె. అంత నచ్చటి మునులు కృష్ణుని తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగులగుచుఁ దదీయ దివ్యనామంబులచే స్తుతియించి స్వాశ్రమంబులకుఁ జనిరి. పిదప నయ్యుధిష్ఠిరుండు) కృష్ణసహితుండై గజపురంబునకుం జని గాంధారీసహితుండైన ధృతరాష్ట్రు నొడంబఱచి వారి సమ్మతంబున వాసుదేవానుమోదితుండై, పితృపైతామహంబైన రాజ్యంబుఁ గైకొని ధర్మమార్గంబునఁ బాలనంబు సేయుచుండె నని సూతుండు సెప్పిన విని శౌనకుం డిట్లనియె. (1-226)
అధ్యాయము - 10
ఆ.వె. ధనము లపహరించి తనతోడఁ జెనకెడు, నాతతాయి జనుల నని వధించి
బంధుమరణ దు:ఖ భరమున ధర్మజుఁ , డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె. (1-227)
వ. అనిన సూతుం డిట్లనియె. (1-228)
కం. కురుసంతతికిఁ బరీక్షి, న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ
ధరణీ రాజ్యమునకు నీ,శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించెన్. (1-229)
వ. (ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబు గా దనునది మొదలగు భీష్ముని వచనంబుల) హరిసంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును, నివర్తిత శంకాకళంకుండు నై నారాయణాశ్రయుండైన