37
మ. తన దేహంబునకై యనేక మృగ సంతానంబుఁ జంపించు దు
ర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృసంఘంబు ని
ట్లనిఁ జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా
యన లక్షావధికైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే ? (1-201)
వ. మఱియుఁ బ్రజాపరిపాలనపరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువులఁ జంపించినఁ బాపంబు లేదని శాస్త్రవచనంబు కలదు. అయిన నిది విజ్ఞానంబు కొఱకు సమర్థంబు గాదు. చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి. హతబంధులైన సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగమేధాది యాగంబుల చేతం బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండగునని నిగమంబులు నిగమించు. పంకంబునఁ బంకిల స్థలంబునకును, మద్యంబున మద్యభాండమునకును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబులైన యాగంబులచేతం బురుషులకుఁ బాప బాహుళ్యంబ కాని పాప నిర్ముక్తి లేదని శంకించెద. (1-202)
అధ్యాయము - 9
కం. అని యిట్లు ధర్మసూనుఁడు, మొనసి నిరాహార భావమున దేవనదీ
తనయుఁడు కూలిన చోటికిఁ, జనియెఁ బ్రజాద్రోహ పాప చలితాత్ముండై. (1-203)
వ. అయ్యవసరమునం దక్కిన పాండవులును, ఫల్గున సహితుండైన పద్మలోచనుండును గాంచన సమంచితంబులైన రథంబులెక్కి ధర్మజుం గూడి చన నతండు గుహ్యక సహితుండైన కుబేరుని భంగి నొప్పె. ఇట్లు పాండవులు పరిజనులు కొలువఁ బద్మనాభ సహితులై కురుక్షేత్రమున కేఁగి దివంబు నుండి నేలం గూలిన దేవత తెఱంగున సంగ్రామ పతితుండైన గంగానందనునకు నమస్కరించిరి. అంత బృహదశ్వ భరద్వాజ పరశురామ గౌతమ పర్వత నారద బాదరాయణ కశ్యపాంగిరస కౌశిక ధౌమ్య సుదర్శన శుక వశిష్ఠాద్యనేక రాజర్షి దేవర్షి బ్రహ్మర్షులు శిష్యసమేతులై చనుదెంచినం జూచి సంతసించి దేశకాలవిభాగవేది యైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి, (1-204)
కం. మాయాంగీకృత దేహుం,డై యఖిలేశ్వరుఁడు మనుజుఁ డైనాడని ప్ర
జ్ఞాయుత చిత్తంబున గాం,గేయుఁడు పూజనము సేసెఁ గృష్ణున్ జిష్ణున్. (1-205)