34
మ. సకలప్రాణి హృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ
క్ష్మ కళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్ర హ
స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురుసంతానార్థియై యడ్డమై
ప్రకటస్ఫూర్తి నణంచె ద్రోణ తనయు బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. (1-183)
వ. ఇట్లు ద్రోణ తనయుం డేసిన ప్రతిక్రియా రహితంబైన బ్రహ్మశిరం బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవ తేజంబున నిరర్థకం బయ్యె. నిజమాయా విలసనమున సకల లోక సర్గ స్థితి సంహారంబు లాచరించునట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు గాదు. తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాల పుత్రికాసహితయై గొంతి, గమనోన్ముఖుండైన హరిం జేరవచ్చి యిట్లనియె. (1-184)
కం. పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ , బరుఁ డవ్యయుఁ డఖిల భూత బహిరంతర్ భా
సురుఁడు నవలోకనీయుఁడు, పరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ ! (1-185)
వ. మఱియు జవనిక మఱువున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా జవనికాంతరాళంబున నిలువంబడి మహిమచేఁ బరమహంసలు నివృత్త రాగద్వేషులు నిర్మలాత్ములు నైన మునులకు నదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు గాని నీవు మూఢదృక్కులుఁ గుటుంబవతులు నగు మాకు నెట్లు దర్శనీయుండవయ్యెదు ? శ్రీకృష్ణ ! వాసుదేవ ! దేవకీనందన ! నందగోప కుమార ! గోవింద ! పంకజనాభ ! పద్మమాలాలంకృత ! పద్మలోచన ! పద్మసంకాశ చరణ ! హృషీకేశ ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము. (1-186)
సీ. తనయుల తోడనే దహ్యమానంబగు, జతుగృహంబందును జావకుండఁ
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల, మారుత పుత్త్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ, ద్రౌపది మానంబు దలఁగకుండ
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే, నా బిడ్డ లనిలోన నలఁగకుండ
తే.గీ. విరటు పుత్త్రిక కడుపులో వెలయు చూలు, ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ
మఱియు రక్షింతివి పెక్కు మార్గములను, నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష ! (1-187)