33
వ. అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసుర పూజితుండై యుద్ధవ సాత్యకులు కొలువ, ద్వారకాగమన ప్రయత్నంబునఁ బాండవుల వీడ్కొని, రథారోహణంబు సేయు సమయంబునఁ దత్తరపడుచు నుత్తర సనుదెంచి కల్యాణ గుణోత్తరుండైన హరి కిట్లనియె. (1-176)
మ. ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ ! నేఁ
డుదరాంతర్గత గర్భదాహమునకై యుగ్రాకృతిన్ వచ్చుచు
న్నది ; దుర్లోక్యము మానుపన్ శరణ మన్యంబేమియున్ లేదు ; నీ
పదపద్మంబులె కాని యొం డెఱుఁగ ; నీ బాణాగ్ని వారింపవే ! (1-177)
కం. దుర్భర బాణానలమున, గర్భములో నున్న శిశువు ఘనసంతాపా
విర్భావంబును బొందెడి ; నిర్భర కృపఁ గావుమయ్య ! నిఖిలస్తుత్యా ! (1-178)
కం. చెల్లెలి కోడల ; నీ మే,నల్లుఁడు శత్రువుల చేత హతుఁ డయ్యెను సం
ఫుల్లారవిందలోచన ! భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపఁగదే ! (1-179)
ఆ.వె. గర్భమందుఁ గమల గర్భాండ శతములు, నిముడుకొన నటించు నీశ్వరేశ !
నీకు నొక్క మానినీ గర్భరక్షణ, మెంత బరువు నిర్వహింతు గాక ? (1-179)
వ. అనిన నాశ్రిత వత్సలుండైన పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబు లవధరించి యిది ద్రోణ నందనుండు లోకమంతయు నపాండవం బయ్యెడునని యేసిన దివ్యాస్త్రమని యెఱింగె. అంతఁ బాండవుల కభిముఖంబై ద్రోణనందను దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబు డగ్గఱిన బెగ్గడిలక వారును ప్రత్యస్త్రంబు లందుకుని పెనంగు సమయంబున, (1-181)
మ. తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స
జ్జనులం బాండు తనూజులన్ మునుపు వాత్సల్యంబుతో ద్రోణ నం
దను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా
ధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్. (1-182)