పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఉ. అవ్యుఁడు గాఁడు వీఁడు ; శిశుహంత దురాత్మకుఁ డాతతాయి హం

తవ్యుఁడు బ్రహ్మబంధుఁ డగుఁ దప్పదు నిక్కము ; "బ్రాహ్మణో న హం

తవ్య" యటంచు వేదవిదితంబగుఁ ; గావున ధర్మదృష్టిఁ గ

ర్తవ్యము వీనిఁ గాచుట యథాస్థితిఁ జూడుము పాండవోత్తమా ! (1-169)


వ. అని సరసాలాపంబులాడి పవన నందను నొడంబఱచి యర్జునుం జూచి "ద్రౌపదికి నాకు భీమసేనునకును సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపు సేయు"మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు తదనుమతంబున, (1-170)


శా. విశ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు మహా వీరుండు ఘోరాసిచే

నశ్వత్థామ శిరోజముల్ దఱిఁగి చూడాంతర్ మహారత్నమున్

శశ్వత్‌కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్

విశ్వాసంబున నూడ్చి ద్రొబ్బె శిబిరోర్వీ భాగముం బాసిపోన్. (1-171)


కం. నిబ్బరపు బాలహంతయు, గొబ్బునఁ దేజంబు మఱియుఁ గోల్పడి నతుఁడై

ప్రబ్బిన చింతన్ విప్రుఁడు, సిబ్బితితో నొడలి గబ్బు సెడి వడిఁ జనియెన్. (1-172)


ఆ.వె. ధనముఁ గొనుట యొండె తల గొఱుగుట యొండె, యాలయంబు వెడల నడచుటొండె

కాని చంపఁదగినయట్టి కర్మంబు సేసినఁ , జంపఁదగదు విప్రజాతిఁ బతికి. (1-173)

అధ్యాయము - 8

వ. ఇ ట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడచి పాండవులు పాంచాలీసహితులై పుత్త్రులకు శోకించి మృతులైన బంధువులకెల్ల దహనాది కృత్యంబులు జేసి జలప్రదానంబు సేయు కొఱకు స్త్రీల ముందల నిడుకొని గోవిందుండునుం దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి హరిపాద పద్మజాత పవిత్రంబులైన భాగీరథీ జలంబుల స్నాతులై యున్నయెడం బుత్త్రశోకాతురులైన గాంధారీ డృతరాష్ట్రులను గుంతీద్రౌపదులను జూచి మాధవుండు మునీంద్రులుం దానునుం బంధుమరణ శోకాతురులైన వారల వగపు మానిచి మన్నించె, నివ్విధంబున, (1-174)


శా. పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులం

జంచద్‌గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి

ప్పించెన్ రాజ్యము, ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ, జే

యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. (1-175)