పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

శా. ఉద్రేకంబున రారు శస్త్రధరులై, యుద్ధావనిన్ లేరు, కిం

చిద్ ద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్

భద్రాకారులఁ జిన్నిపాఁపల రణప్రౌఢక్రియాహీనులన్

నిద్రాసక్తుల సంహరింప నకటా ! నీ చేతు లెట్లాడెనో ? (1-161)


ఉ. అక్కట ! పుత్త్రశోకజనితాకులభావ విషణ్ణచిత్తనై

పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ

డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేఁ

డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో ? (1-162)


వ. అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె. (1-163)


ఉ. ద్రోణునితో శిఖిం బడక ద్రోణ కుటుంబిని యున్నదింట, న

క్షీణ తనూజ శోక వివశీకృతనై విలపించు భంగి నీ

ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో

ప్రాణ వియుక్తుఁడైన నతిపాపము ; బ్రాహ్మణహింస మానరే ? (1-164)


కం. భూపాలకులకు విప్రులఁ , గోపింపఁగఁ జేయఁదగదు, కోపించినఁ ద

త్కోపానలంబు మొదలికి, భూపాలాటవులఁ గాల్చు భూకంపముగాన్. (1-165)


వ. అని యిట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్‌వ్యళీకంబును సమంజసంబును శ్లాఘ్యంబునుంగా ద్రౌపది పలుకు పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె. నకుల సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి. సమ్మతింపక భీముం డిట్లనియె. (1-166)


చం. కొడుకులఁ బట్టి చంపెనని కోపము నొందదు, బాలఘాతుకున్

విడువు మటంచుఁ జెప్పెడిని, వెఱ్ఱిది ద్రౌపది, వీఁడు విప్రుఁడే ?

విడువఁగ నేల ? చంపుఁడిటు వీనిని మీరలు, చంపరేని నా

పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెదఁ , జూడుఁ డిందఱున్. (1-167)


వ. అని పలికిన నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె. భీముని సంరంభంబు సూచి హరి చతుర్భుజుండై రెండు చేతుల భీముని వారించి కడమ రెండు చేతుల ద్రుపదపుత్త్రికను దలంగంద్రొబ్బి, నగుచు భీమునికిట్లనియె. (1-168)