30
ఉ. మాఱు పడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్నపాఁపల వధించె నిశీథమునందుఁ గ్రూరుఁడై ;
పాఱుఁడె వీఁడు ? పాతకుఁడు ! ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం
బాఱెడి వీనిఁ గావకు కృపామతి నర్జున ! పాపవర్జనా ! (1-153)
చం. వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని, సౌఖ్యముగ మద్యముఁ ద్రావినవాని, భగ్నుఁడై
పఱచినవాని, సాధు జడభావము వానినిఁ , గావుమంచు వా
చఱచినవానిఁ , గామినులఁ జంపుట ధర్మము గాదు ఫల్గునా ! (1-154)
శా. స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ గరుణా సంగంబు సాలించి య
న్య ప్రాణంబులచేత రక్షణము సేయున్, వాఁ డధోలోక దు:
ఖ ప్రాప్తుండగు ; రాజదండమున సత్కల్యాణుఁ డౌ నైన నీ
విప్రున్ దండితుఁ జేయుమేటికి మహా విభ్రాంతితో నుండఁగన్ ? (1-155)
వ. అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మణుండు (కృతాపరాధుండైనను) వధ్యుండు గాఁడను ధర్మంబుఁ దలఁచి చంపక ద్రుపదరాజ పుత్త్రికిఁ దన చేసిన ప్రతిజ్ఞం దలంచి బద్ధుండైన గురునందనుం దోడ్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబు కడకు వచ్చి, (1-156)
కం. సురరాజ సుతుఁడు సూపెను, దురవధి సుతశోక యుతకు ద్రుపదుని సుతకున్
బరిచలితాంగ శ్రేణిం, బరుష మహాపాశ బద్ధ పాణిన్ ద్రౌణిన్. (1-157)
వ. ఇట్లర్జునుండు తెచ్చి చూపిన బాలవధజనిత లజ్జాపరాఙ్ముఖుండైన గురుని కొడుకుం జూచి మ్రొక్కి (సుస్వభావ) యగు ద్రౌపది యిట్లనియె. (1-158)
మ. పరఁగన్ మా మగవారలందఱును మున్ బాణ ప్రయోగోప సం
హరణాద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి ; పుత్త్రాకృతి నున్న ద్రోణుఁడవు ; నీ చిత్తంబులో లేశమున్
గరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే ? (1-159)
కం. భూసురుఁడవు బుద్ధి దయా, భాసురుఁడవు శుద్ధవీర భట సందోహా
గ్రేసరుఁడవు శిశుమారణ, మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ ! (1-160)