Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

వ. ఇట్లోపినంత దూరంబునుం బరువిడి వెనుకఁ జూచి రథ తురంగంబు లలయుటఁ దెలిసి, నిలిచి ప్రాణ రక్షణంబునకు నొండుపాయంబు లేదని నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహిత చిత్తుండై, ప్రయోగంబ కాని యుపసంహారంబు నేఱకయుం బ్రాణ సంరక్షణార్థంబునకై పార్థుని మీఁద బ్రహ్మశిరోనామకాస్త్రంబుఁ బ్రయోగించిన నది ప్రచండ తేజంబున దిగంతరాళంబులు నిండి ప్రాణ భయంకరంబై తోఁచిన హరికి నర్జునుం డిట్లనియె. (1-145)


సీ. పద్మలోచన ! కృష్ణ ! భక్తాభయప్రద ! వినుము సంసారాగ్ని వేఁగుచున్న

జనుల సంసారంబు సంహరింపఁగ నీవు, దక్క నన్యులు లేరు తలఁచి చూడ

సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, ప్రకృతిపరుండవు పరమపురుష !

నీ ప్రబోధము చేత నీ మాయ నంతయు, నణఁతువు ని:శ్రేయసాత్మ యందు

ఆ.వె. మాయయందు మునిఁగి మనువారలకుఁ గృపఁ , జేసి ధర్మ ముఖ్యచిహ్నమైన

శుభము సేయుచుందు సుజనుల నవనిలోఁ , గావఁ బుట్టుదువు జగన్నివాస ! (1-146)


కం. ఇది యొక తేజము, భూమియుఁ , జదలును దిక్కులును నిండి సర్వంకషమై

యెదురై వచ్చుచు నున్నది, విదితముగా నెఱుగఁ జెప్పవే దేవేశా ! (1-147)


వ. అనిన హరి యిట్లనియె. (1-148)


శా. జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛువై

బ్రహ్మాస్త్రంబదె యేయ వచ్చె ; నిదె తద్బాణాగ్ని బీభత్స ! నీ

బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మఱలింపన్ రాదు ; సంహార మీ

బ్రహ్మాపత్య మెఱుంగఁ ; డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై. (1-149)


వ. అనిన నర్జునుండు జలంబులు వార్చి హరికిం బ్రదక్షిణంబు వచ్చి ద్రోణనందనుం డేసిన బ్రహ్మశిరోనామకాస్త్రంబు మీఁదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన. (1-150)


మ. అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్

రవి వహ్నిద్యుతిఁ బోరుచుం ద్రిభువన త్రాసంబుఁ గావింపఁగా

వివశ భ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వీక్షింప నా వేళ మా

ధవు నాజ్ఞన్ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్. (1-151)


వ. ఇ ట్లస్త్రద్వయంబు నుపసంహరించి ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని రోషారుణిత లోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువుం గట్టిన చందంబున బంధించి శిబిరంబు కడకుం గొని చని హింసింతునని తిగిచినం జూచి హరి ఇట్లనియె. (1-152)