Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

కం. ధీరులు నిరపేక్షులు నా, త్మారాములు నైన మునులు హరిభజనము ని

ష్కారణమ చేయుచుందురు, నారాయణుఁ డట్టివాఁడు నవ్యచరిత్రా ! (1-137)


కం. హరిగుణ వర్ణన రతుఁడై, హరితత్పరుఁడైన బాదరాయణి శుభ త

త్పరతం బఠించెఁ ద్రిజగద్, వరమంగళమైన భాగవత నిగమంబున్. (1-138)


కం. నిగమంబులు వేయుఁ జదివిన, సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్

సుగమంబు భాగవతమను, నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా ! (1-139)

అర్జునుండు పుత్త్రఘాతి యగు నశ్వత్థామ నవమానించుట

వ. అని పలికి, రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మకర్మముక్తులును, బాండవుల మహాప్రస్థానంబును, గృష్ణకథోదయంబును జెప్పెద. కౌరవ దృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులయినవారలు స్వర్గమునకుం జనిన వెనుక, భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి కూలిన నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయువాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్త్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించె. అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు. (1-140)


ఉ. బాలుర చావు కర్మములఁ బడ్డఁ గలంగి యలంగి యోరువం

జాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి పాం

చాల తనూజ నేలఁ బడి జాలిబడం గని యెత్తి మంజు వా

చాలతఁ జూపుచుం జికుర జాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనెన్. (1-141)


మ. ధరణీశాత్మజ వీవు నీకు వగవన్ ధర్మంబె ? తద్ద్రౌణి ని

ష్కరుణుండై విదళించె బాలకుల ; మద్గాండీవ నిర్ముక్త భీ

కర బాణంబుల నేఁడు వాని శిరంబున్ ఖండించి నేఁ దెత్తుఁ ద

చ్ఛిరముం ద్రొక్కి జలంబులాడు మిచటన్ శీతాంశు బింబాననా ! (1-142)


వ. అని యొడంబఱచి తనకు మిత్త్రుండును సారథియు నైన హరి మేలనుచుండం గవచంబు దొడిగి గాండీవంబు ధరించి కపిధ్వజుండై గురుసుతుని వెంట రథంబుఁ దోలించిన. (1-143)


శా. తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్ దర్శించి తద్ద్రౌణి యా

పన్నుండై శిశుహంత గావున నిజ ప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్

మున్నా బ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా

సన్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితోన్. (1-144)