Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

సమద కరి కర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథిక జన క్రమాతిరేకంబులైన తటాకంబులును, బహువిధ విహంగ నినద మనోహరంబులై వికచారవింద మకరంద పాన పరవశ పరిభ్రమద్ భ్రమర సుందరంబులైన సరోవరంబులును దాఁటి చనుచు క్షుత్‌పిపాసా సమేతుండనై నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై నీరుద్రావి గతశ్రముండనై, (1-119)


కం. సాలావృక కపి భల్లుక, కోలేభ లులాయ శల్య ఘూక శరభ శ

ర్దూల శశ గవయ ఖడ్గ, వ్యాళాజగరాది భయద వన మధ్యమునన్. (1-120)


వ. దుస్తరంబైన నలవేణు కీచక గుల్మ లతా గహ్వరంబుల పొంత నొక రావిమ్రాను డగ్గఱఁ గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మస్వరూపు హరిం జింతించితి. (1-121)


శా. ఆనందాశ్రులు కన్నులన్వెడల రోమాంచంబుతోఁ దత్పద

ధ్యానారూఢుఁడనైన నాతలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే

నానందాబ్ధి గతుండనై యెఱుఁగలేనైతిన్ నను న్నీశ్వరున్

నానాశోకహమైన యత్తనువు గానన్నేఱ కట్లంతటన్. (1-122)


వ. లేచి నిలుచుండి క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు హృదయంబున నిలుపుకొని యాతురుం బోలె చూచియుం గానక నిర్మనుష్యంబైన వనంబునం జరియించుచున్న నను నుద్దేశించి వాగగోచరుండైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపఁజేయు చందంబున నిట్లనియె. (1-123)


ఉ. ఏల కుమార ! శోషిలఁగ ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ

జాలవు నీవు ; కామముఖ షట్కము నిర్దళితంబు సేసి ని

ర్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని కుయోగిఁ గానఁగాఁ

జాలఁడు ; నీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్. (1-124)


కం. నా వలనఁ గోర్కి యూరక, పోవదు విడిపించు దోషపుంజములను మ త్సేవం బుట్టును వైళమ, భావింపఁగ నాదు భక్తి బాలక ! వింటే ? (1-125)


కం. నా యందుఁ గలుగు నీ మది, పాయదు జన్మాంతరముల బాలక ! నీ వీ

కాయంబు విడిచి మీఁదట, మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై. (1-126)