24
అధ్యాయము - 6
వ. ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియె. (1-111)
మ. విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముం జెప్పి పో
యిన బాల్యంబున వృద్ధభావమున నీకీ రీతి సంచారముల్
చనె నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ ద
త్తనువుం బాసిన చందమెట్లు చెపుమా దాసీసుతత్వంబుతోన్. (1-112)
వ. అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె. దాసీపుత్త్రుండ నైన యేను భిక్షుల వలన హరివిజ్ఞానంబు గలిగియున్నంత. (1-113)
సీ. మమ్ము నేలినవారి మందిరంబునఁ గల, పనులెల్లఁ గ్రమమున భక్తిఁ జేసి
తన పరాధీనతఁ దలఁపదు సొలసితి, నలసితి నాకొంటి ననుచు వచ్చు
మాపును రేపును మా తల్లి మోహంబు, సొంపార ముద్దాడుఁ జుంచు దువ్వు
దేహంబు నివురు మోదించుఁ గౌఁగిటఁ జేర్చు, నర్మిలితో నిట్లు నన్ను మనుప
ఆ.వె. నేను విడిచి పోక యింత నుండితి నయ్య, మోహి గాక యెఱుక మోసపోక
మాఱు చింత లేక మౌనియై యేనేండ్ల, వాఁడ నగుచుఁ గొన్ని వాసరములు. (1-114)
వ. అంత. (1-115)
కం. సదనము వెలువడి తెఱువునఁ , జెదరక మా తల్లి రాత్రిఁ జీఁకటి వేళన్
మొదవుం బిదుకఁగ నొక ఫణి, పదభాగముఁ గఱచెఁ ద్రొక్కఁబడి మునినాథా ! (1-116)
కం. నీలాయత భోగఫణా, వ్యాళానల విష మహోగ్ర వహ్నిజ్వాలా
మాలా వినిపాతితయై, వ్రాలెన్ ననుఁ గన్న తల్లి వసుమతి మీఁదన్. (1-117)
ఉ. తల్లి ధరిత్రిపై నొఱఁగి తల్లడపాటును జెంది చిత్తమున్
బల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి కలంగ కేను నా
యుల్లములోన మోహరుచి నొందక సంగము వాసె మేలు రా
జిల్లె నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధి సేయుచున్. (1-118)
వ. ఉత్తరాభిముంఖుండనై యేను వెడలి జనపదంబులును బురంబులును బట్టణంబులును గ్రామంబులును బల్లెలును మందలును మహోద్యానంబులును గిరాత పుళింద నివాసంబులును వనంబులును జిత్రధాతు విచిత్రితంబులైన పర్వతంబులును