Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

ధైర్యశూన్యులు మందప్రజ్ఞు లల్పాయువులు దుర్బలురు నయ్యెదరని తన దివ్యదృష్టిం జూచి సర్వవర్ణాశ్రమంబులకు హితంబు సేయందలంచి నలుగురు హోతల చేత ననుష్ఠింపఁదగి ప్రజలకు శుద్ధికరంబులైన వైదిక కర్మంబు లెడతెగకుండు కొఱకు నేకంబైన వేదంబు ఋగ్యజుస్‌సామాధర్వణంబులను నాలుఁగు నామంబుల విభాగించి యితిహాస పురాణంబు లన్నియుఁ బంచమవేదంబని పల్కె, నందు, (1-80)


సీ. పైలుండుఋగ్వేద పఠనంబు దొరకొనె, సామంబు జైమిని చదువుచుండె

యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ , దుది నధర్వంబు సుమంతుఁడు వఠించె

నఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి , రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ

దమ తమ వేద మా తపసులు భాగించి, శిష్య సంఘములకుఁ జెప్పిరంత

తే.గీ. శిష్యులెల్లరు నాత్మీయ శిష్యజనుల, కందు బహుమార్గములు సెప్పి యనుమతింపఁ

బెక్కు శాఖలు గలిగి యీ పృథివిలోన, నిగమ మొప్పారె భూసుర నివహమందు. (1-81)


వ. ఇట్లు మేధాహీనులైన పురుషుల చేత నట్టి వేదంబులు ధరియింపంబడుచున్నవి. మఱియు దీనవత్సలుండైన వ్యాసుండు స్త్రీశూద్రులకుం ద్రైవర్ణికాధములకు వేదంబులు విన ననర్హంబులు గావున మూఢుల కెల్ల మేలగునని భారతాఖ్యానంబు చేసియు నమ్ముని భూతహితమందుఁ దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీతటంబున నొంటినుండి హేతువు వితర్కింపుచుఁ దనలో నిట్లనియె. (1-82)


సీ. వ్రతధారినై వేదవహ్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మములఁ గొఱత

పడకుండ నడుపుదు భారత మిషమునఁ బలికితి వేదార్థభావమెల్ల

మునుకొని స్త్రీశూద్ర ముఖర ధర్మములందుఁ బెలిపితి నేఁ జెల్ల దీనఁ జేసి

యాత్మ సంతస మంద దాత్మలో నీశుండు, సంతసింపక యున్న జాడ తోఁచె

ఆ.వె. హరికి యోగివరుల కభిలషితంబైన, భాగవత విధంబుఁ బలుకనైతి

మోసమయ్యెఁ దెలివి మొనయదు మఱచితి, ననుచు వగచుచున్న యవసరమున. (1-83)

వ్యాసుని కడకు నారదుండు వచ్చుట

సీ. తన చేయి వల్లకీ తంత్రీచయంబున, సతత నారాయణ శబ్దమొప్ప

నానన సంభూత హరిగీత రవసుధా ధారల యోగీంద్రతతులు సొక్కఁ

గపిల జటాభార కాంతిపుంజంబుల, దిశలు ప్రభాత దీధితి వహింపఁ

దనులగ్న తులసికా దామ గంధంబులు, గగనాంతరాళంబు గప్పుకొనఁగ