17
ఆ.వె. యీ పురాణమెల్ల నెలమి నా శుకయోగి, గంగ నడుమ వచ్చి ఘనవిరక్తి
యొదవి మునుల తోడ నుపవిష్టుఁడగు పరీ,క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు. (1-71)
వ. కృష్ణుండు ధర్మజ్ఞాదుల తోడం దన లోకంబునకుం జనిన పిమ్మటం గలికాల దోషాంధకారంబున నష్టదర్శనులైన జనులకు నిప్పుడీ పురాణంబు కమలబంధుని భంగి నున్నది. నాఁ డందు భూరితేజుండై కీర్తించుచున్న విప్రఋషి వలన నేఁ బఠించిన క్రమంబున నా మదికి గోచరించినంతయ వినిపించెద ననిన సూతునకు మునివరుండైన శౌనకుండిట్లనియె. (1-72)
అధ్యాయము-4
శా. సూతా ! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్టు నే
శ్రోతల్ గోరిరి యేమి హేతువునకై శోధించి లోకైక వి
ఖ్యాతిన్ వ్యాసుఁడు మున్ను భాగవతముం గల్పించెఁ దత్పుత్త్రుఁ డే
ప్రీతిన్ రాజునకీ పురాణకథఁ జెప్పెన్ జెప్పవే యంతయున్. (1-73)
వ. బుధేంద్రా ! వ్యాసపుత్త్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం డేకాంతమతి మాయాశయనంబు వలనం దెలిసినవాఁడు. గూఢుండు మూఢుని క్రియ నుండు నిరస్తఖేదుం డదియునుం గాక, (1-74)
తరలము :- శుకుఁడు గోచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల
జ్జకుఁ జలింపక చీరలొల్లక చల్లు లాడెడి దేవ క
న్యకలు "హా ! శుక" యంచు వెన్క జనంగ వ్యాసునిఁ జూచి యం
శుకములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ ! (1-75)
వ. మఱియు నగ్నుండుఁ దరుణుండు నై చను తన కొడుకుం గని వస్త్ర పరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండు నైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవ రమణులం గని వ్యాసుండు గారణం బడిగిన వారలు " నీ కొడు కిది సతి, వీఁడు పురుషుండని భేదదృష్టి లేక యుండు. మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి మహాంతరంబు గల" దనిరి. అంత శుకుండు కురుజాంగల దేశంబుల సొచ్చి హస్తినాపురంబునఁ బౌరజనంబులచే నెట్లు జ్ఞాతుండయ్యె ? మఱియు నున్మత్తుని క్రియ మూఢుని తెఱంగున జడుని భంగి నుండు నమ్మహాయోగికి రాజర్షి యైన పరీక్షిన్మహారాజు తోడ సంవాదం బెట్లు సిద్ధించె ? బహుకాల