Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

మ. వరగోవింద కథా సుధారస మహా వర్షోరు ధారా పరం

పరలం గాక బుధేంద్ర చంద్ర ! యితరోపాయానురక్తిం బ్రవి

స్తర దుర్దాంత దురంత సుస్సహ జనుస్సంభావితానేక దు

స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాఱునే ? (1-47)


సీ. హరినామ కథన దావానల జ్వాలలఁ , గాలవే ఘోరాఘ కాననములు

వైకుంఠ దర్శన వాయు సంఘంబుచేఁ , దొలఁగవే బహుదు:ఖ తోయదములు

కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ , గూలవే సంతాప కుంజరములు

నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిచేఁ , దీఱవే షడ్వర్గ తిమిర తతులు

ఆ.వె. నళిన నయన భక్తి నావచేఁ గాక సం, సార జలధి దాఁటి చనఁగరాదు

వేయు నేల మాకు విష్ణు ప్రభావంబుఁ , దెలుపవయ్య సూత ! ధీ సమేత ! (1-48)


వ. మఱియుఁ గపట మానవుండును గూఢుండు నైన మాధవుండు రామసహితుండై యతిమానుషంబులైన పరాక్రమంబులు సేసె నఁట. వాని వివరింపుము. కలియుగంబు రాఁగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘ సత్ర నిమిత్తంబున హరికథలు విన నెడ గలిగి నిలిచితిమి. దైవయోగంబున,(1-49)

కం. జలరాశి దాఁటఁగోరెడి, కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిన్

గలిదోష హరణ వాంఛా, కలితులమగు మేము నిన్నుఁ గంటిమి సూతా !1-50)


కం. చారుతర ధర్మరాశికి, భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్

ధారకుఁడు లేక యెవ్వనిఁ , జేరెను ధర్మంబు బలుపు సెడి మునినాథా ! (1-51)

అధ్యాయము - 2

సూతుండు నారాయణకథా ప్రశంస జేయుట

వ. అని యిట్లు మహనీయ గుణ గరిష్ఠులయిన శౌనకాది మునిశ్రేష్ఠులడిగిన రోమహర్షణ పుత్త్రుండై యుగ్రశ్రవసుండను పేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు, (1-52)


మ. సముఁడై యెవ్వఁడు ముక్త కర్మ చయుఁడై సన్న్యాసియై యొంటిఁ బో

వ మహాభీతి నొహో ! కుమార ! యనుచున్ వ్యాసుండు సీరంగ వృ

క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె మున్నట్టి భూ

త మయున్ మ్రొక్కెద బాదరాయణిఁ, దపో ధన్యాగ్రణిన్ ధీమణిన్. (1-53)