2
శా. పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ ! యో యమ్మ ! మేల్
పట్టున్ మానకుమమ్మ ! నమ్మితిఁ జుమీ ! బ్రాహ్మీ ! దయాంభోనిధీ !(1-7)
6. కనకదుర్గాస్తుతి
ఉ. అమ్మలఁ గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి వుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.(1-8)
7. శ్రీమహాలక్ష్మీ స్తుతి :
మ. హరికిం బట్టపు దేవి పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క చం
దురు తోఁబుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూఁబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.(1-9)
వ. అని యిష్టదేవతలం జింతించి దినకర కుమారప్రముఖులం దలంచి ప్రథమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి హయగ్రీవదనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసుండగు వ్యాసునకు మ్రొక్కి శ్రీ మహాభాగవత కథా సుధారస ప్రయోగికి శుకయోగికి