ఊహాపథ సమతీతా
ముపమారహితోజ్వలాంగసౌందర్యాం|
కోఽహం వర్ణయితుం త్వా
మేహి మదంబ! ప్రదేహి పదసేవామ్ |
తాత్పర్యము:
తల్లీ! లోకములో నెవరైనను ఒక వస్తువును వర్ణింపదలచినప్పుడు దానిని మనస్సులో చక్కగా భావించుకొని, తనకు తెలిసిన సదృశ వస్తువులతో పోల్చి వర్ణింతురు. మఱి నీ రూపము ఊహకే అందునది కాదే! విశ్వమోహనమగు సౌందర్యముతో మెఱిసిపోవుచున్నదే! దానిని పోల్చుటకు సాటివస్తువే లేదు. అట్టి నిన్ను వర్ణించుట యెట్లు సాధ్యము? అందును అజ్ఞాని నగు నాకు ఏమి యోగ్యత యున్నది? "తల్లీ! నాకు దర్శన మిచ్చి నీ పాద సేవా భాగ్యమును కరుణింపుము" అని వేడుకొనుట యొకటి మాత్రమే నేను చేయగలను. కావున దానిని నాకు ప్రసాదింపుము.
విశేషములు :
(1) "ఊహా....తాం" ఊహాపోహలు మనోవృత్తులు. మనస్సు వృత్తిరహిటము అయినప్పుడే అనగా యోగసిద్ధి యగు అమనస్కత ప్రాప్తించినప్పుడు మాత్రమే ఉపాసకుడు దేవీసాన్నిధ్యమును పొందగలుగుచున్నాడు.
"యోగ శ్చిత్తవృత్తినిరోధః" ( యోగ శాస్త్రము ).
(2) "మదంబ!" నీవు నాకు తల్లివి; తల్లి, కుమారుని యోగ్య తాయోగ్యతలను విచారింపకుండ వాని యార్తనాదమును విన్నంతనే తనకు తానుగా వానియొద్దకు వచ్చి వానిని లాలించును. అట్లే నీవును నన్ను అనుగ్రహింపుము.శ్రీదేవీ సువర్ణమాలా