పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

శ్రీ వేంకటేశ్వర వచనములు



78

హలాయుధధరా ! మన్మథుం డనియెడు నింద్రజాల విద్యలవాఁడు సుందర స్త్రీ, పురుషులచేత నింద్రజాలవిద్యల నాడింపుచున్న వాఁడు. అన్యోన్యావలోకంబుల కమల కల్హార పుష్పంబులు గురియింపుచున్నవాడు. మోహసముద్రముల నాకర్షించి బట్టబయల యీఁదింపు చున్నాఁడు. తుఱుమునఁ జీకట్లును ముఖంబునఁ జంద్రోదయంబును గాత్రంబున మొయిలులేనివానలును పరస్పర విహారంబుల నగ్నిస్తంభనలును రతిబంధంబుల సిద్ధవిద్యలునుం జూపుచున్నవాఁడు. ఈ యాటలకు లోనై సమ్ముఖంబులనున్న జీవులము మిమ్ము నెఱుంగ వెఱంగందు చున్న వారము ; గాని, నీ వీ మాయలకు లోనుగాక చిఱునవ్వుతో వీక్షింపుచున్నవాఁడవు. ఆతని కీవిద్యలు నేర్పిన గురుండవు నీవె కాఁబోలుదువు. నీకు వినోదంబైన నాయెఁగాని మమ్ము బ్రమియింపకువే ; శ్రీ వేంకటేశ్వరా !

79

ఖరదూషణవైరీ ! నీవు కల్పించిన 'వేదో క్తధర్మంబు లించుకంత దప్పక నడచెనా పాపంబులు చెందవు. అటమీఁద పరకాంతలు పరధనంబులు వేడుక పుట్టించుచు ముందఱఁ బొదలంగా జీవులము చంచలచిత్తులము గనుక నా పాపంబులం దగిలి చేయక మానలేము. చేసినకర్మంబులు బలవంతంబులు. అనుభవింపక తీఱదు. దాన మాకు సౌఖ్యంబు గాదు. మేము గావించు నేరములు మామీఁద నుండంగాను మీకు నేమి విన్నపంబు చేసెదము? మీ యాశ్రయ మనియెడి వజ్రపంజర మున్నది. మీ నామస్మరణ మనియెడి ఖడ్గమున్నది. మీపై భక్తి యనియెడి కవచమున్నది. మీకృప యనియెడి సహాయంబున్నది. నా యాచార్యులచేత సకల మీదురితములను గండలుగాఁ గొని తునియలు చేసి పాఱవేయించెదవో కాక నీవే మాపై దయదలంచెదవో; శ్రీ వేంకటేశ్వరా !