పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

31

బున సుఖంబున్నాఁడను. దీన నిఁక నీ సారూప్యంబనియెడి ధనంబు గడించుకొనఁగలను; శ్రీ వేంకటేశ్వరా !

67

శంఖపాణీ ! నా దేహం బొక నెత్తవుంబలక. నా పంచవింశతి తత్వంబులు సారెలు. నా యుచ్చ్వాసనిశ్వాసంబులు పాచికలు. నా పుణ్య పాపంబులు పన్నిదంబు లొడ్డిన ద్రవ్యంబులు. ఈరీతిఁ దన్ను కాడెడి,జూజగాఁడను. నీ మాయతో నింతగాలము నాడియాడి యోడి మఱి యొక్కొక్క జన్మంబునను మగుడ సూడుగొని యీ యాటలె యాడు చున్నాఁడను. గెలుపెట్టిదో, యెప్పుడో యెఱుంగను. నీవు నన్నేలిన యేలికవు. బంటు జయించినజయ మేలికదె కదా ! నాకుంగాను సూడు వెట్టి గెలిపింపుమా ! శ్రీ వేంక టేశ్వరా !

68

అభేద్యవిక్రమా ! కన్నులు మూసిన లయంబును, దేఱిచూచిన జగం బును, మేలుకొనిన నందు జననంబును, బరస్త్రీగమనంబున నరకంబును, స్వపత్నీ సంతానంబున స్వర్గనివాసంబును, క్రోధంబున 'రాక్షసత్వంబును, ననాచారంబునఁ బాపంబును, నాచారంబున పుణ్యంబును, నసత్యంబునఁ గీడును, సత్యంబున మేలును నీరీతి నందఱకుఁ గానవచ్చు. మఱపు పుట్టించుచున్నది నీ మాయయే యని యీయర్దం బెఱుంగుదురుగాని బ్రమియనివారు లేరు. ఇంతగాలంబున నే నెత్తిన జన్మంబులుం గోటానఁ గోట్లు గలవు. అన్నియు సంసారంబునకే సమర్పణం బయ్యెం గాని యిందులో నొక జన్మమైనను మీకు సమర్పణంబు గాదయ్యె. దేవా, యింక నా నేరంబు లెన్ని యని యెంచెద ! గతజల సేతు బంధనంబు. అట నీమాయ నిగ్రహించెద ననిన నది యశ క్తి దుర్జనత్వంబు. నా మూఢత్వంబు చూచి యీ జన్మంబున నీవే దయదలఁచి నన్ను దాసునిగాఁ జేసితివి. నీ కుపకారంబు దక్కెను. నా మనోరథంబు నీడేఱెను; శ్రీ వేంకటేశ్వరా !