పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

శ్రీ వేంకటేశ్వర వచనములు

ఇన్ని యపరాధంబులకు గుఱియైనవాఁడ నగుట నాభయము నివారింతు వని నీమఱుఁగుసొచ్చితి. చేయంగల విన్నపంబు లెల్లఁ జేసికొంటి; నీ చిత్తం బెట్లున్నదో యెఱుంగను. శ్రీ వేంకటేశ్వరా !

46

ఆదిమూర్తీ : నేను భూలోకంబున నా కర్మంబు లనుభవింపం బుట్టితిఁ గాని నిన్ను గుఱు తెఱింగి కొలిచెద నని పుట్టినవాఁడను గాను. ఇంతలో నీవు నిర్హేతుకలీలం గరుణించి, నన్ను బంటుగా నేలితివి. నా భాగ్యంబు లేమని పొగడెద ; నిన్నుం బొగడుటేకాక! నే నేమితపంబు చేసితినో యది దలంపనేల? నీమహిమ దలఁచుటగాక! నా బుద్ది నేమి మెచ్చుట ? నీ సంకల్పంబు మెచ్చుటగాక ! దప్పిగొన్న యతండు జలముల వెదకుచుండ భాగీరథీజలంబబ్బినట్లు, కృషికుండు తనచేనుదున్నుచో నాఁగంటికొన బంగారు కొప్పెర దొరకినట్లు, పులిజూజంబాడెడువాఁడు ఱాలేఱుతఱి మాణిక్యంబు చేకూడినట్లు నీవు నాకుం దొరకితివి ; శ్రీ వేంకటేశ్వరా !

47

మత్స్యావతారా ! అవధారు ! దేవ, నాలోని పాపపురుషుండు విజృం భించి తఱుముకొని రాఁగా నీ మఱుంగు సొచ్చితి. అంతలో నీ యభయదాన పురుషుండు వచ్చి యతనితో దారుణ యుద్ధంబు సేయఁ దొడంగెను. అరిషడ్వర్గంబు లనియెడి చుక్కలు డుల్లె; "తాపత్రయం బనియెడి పిడుగులు రాలె; చింతాసముద్రంబు గలంగె; నిర్దయ యనెడి ధరిత్రి వణఁకె ; దుర్గుణంబు లనియెడి దిక్కులు చలియించె; దురాశాపర్వతంబులు గ్రుంగె; అతిఘోరసమరంబునఁ బాపపురుషుండు నోడిపాఱె; మీయభయదాన పురుషుండు గెలిచె; ఈ మేలువార్త "మీకు విన్న వించితి; శ్రీ వేంకటేశ్వరా !