పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

21

కామక్రోధాదులు సారెసారెకుఁ బట్టఁ గడంగెనేని నీ ముద్రలు మోచిన వాడ నని యడ్డంబు రమ్మీ! పురాకృతకర్మంబులు నన్నుఁ దగిలెనేని సంకీర్తన సేయువాఁడనని మన్నించి రక్షించుకొనుమీ ! నడుమ నడుమ నజ్ఞానంబు చిక్కించుకొనిన దానిం బరిహరించి నన్నుం జేపట్టుమీ ! మనసుపట్టలేక మునుపేవిన్నవించితి. నీ వనాథనాథుండవు; ఆర్తశరణ్యుండవు; సర్వ భూత దయానిధివి; నిర్హేతుక బంధుండవు; నీవు నా హృదయంబులోనివాఁడవు; నాకు దిక్కు. నీవే సుమీ; శ్రీ వేంకటేశ్వరా !

44

మాధవా ! మీ రర్జునునకు సాక్షాత్కారమై యుండి భగవద్గీత లేడు నూఱు గ్రంథంబులు బోధించితిరి. విశ్వరూపంబుసూపి ప్రమాణంబుచేసి మి మ్మెఱుంగు మని యుపదేశించితిరి. ఇంక మముబోఁటి జీవుల నెన్నిట బోధింపవలయునో యందులకే చింతించెదను. అవులే; ఇంకొక యుపాయంబు విచారించుకొంటి; తొల్లి వాల్మీకి "రామా" యను రెండక్షరముల నుడివి బ్రహ్మర్షి యై మీ కృపకుం బాత్రుండయ్యె. నారదుండు మీ సంకీర్తనంబు సేసి కృతార్థుఁ డయ్యె. విభీషణుఁడు మీకు శరణుసొచ్చి బ్రదికె. నాకు నిదియే మార్గంబు; శ్రీ వేంక బేశ్వరా !

45

నందనందనా !. చేయంగల పాపంబు లన్నియు జేసితి; నా కర్మంబే మనుచున్నదో యెఱుంగను. దేవర్షి పితృతర్పణంబులు సేయకుంటిని; యమకింకరు లే మనుచున్నారో యెఱుంగను. ఎక్కడ లేనియుద్యోగంబులు సేయుచున్నాఁడను; విధి యేమనుచున్నదో యెఱుంగను. అన్నపానాది భోగంబు లనుభవించుచున్నాఁడను; చిత్రగుప్తు ! డేమీ వ్రాయుచున్నాఁడో యెఱుంగను. బాల్య కౌమార యౌవన గతులం బెరుగుచున్న వాఁడను; కాలం బేమనుచున్నదో యెఱుంగను.