పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

వచ్చెనేని నా మదిలో నీ పాదంబులు దలంచి నీ మఱుఁగున డాఁగెదను. పురాకృతకర్మంబులు నన్ను ననుభవింపవలయునని పట్టుకొనియెనేని నీవాఁడ నని బలిమిం ద్రోచెదను. యమకింకరులు నా తెరువు వచ్చిరేని నా భుజంబులనున్న శంఖ చక్ర లాంఛనంబులు చూపి వెఱపించెదను. సంసారపాశంబులు నన్నుఁ దగిలెనేని నీకథలు విని పరాకు చేసికొనియెదను నీమాయ నన్ను ముంచుకొనియెనేని నీ దాసులకుం జెప్పి నీకు విన్నపంబు సేయించెద. నా యపరాధంబులు చిత్తంబునం బెట్టకుమీ; శ్రీ వేంకటేశ్వరా!

29

స్వామీ! నీవు రక్షింపఁదలంచిన బ్రహ్మశాపం బేమి సేయఁగలదు? ధ్రువునిఁ జిరకాలజీవునిఁ జేసితివి. బ్రహ్మాస్త్రం బేమి సేయఁగలదు? పరీక్షితుని బ్రదికించితివి. బ్రహ్మమాయ యేమి సేయఁగలదు? గోవత్సబాలకుల నిర్మించితివి. మృత్యు వేమి సేయఁగలదు? సాందీపని కొడుకులం దెచ్చితివి. పాపం బేమి సేయఁగలదు? అజామీళు నుద్దరించితివి. అన్నింట బలవంతుఁడవగుట నీ చేఁతలం గానంబడియె. నీ దాసులైన వారికి నేభయంబు నొందకుండం గాతువు. నీ ప్రతాపం బేమని వర్ణింపవచ్చు? శ్రీ వేంకటేశ్వరా!

30

పుండరీకాక్షా ! అజ్ఞాన జంతువులైన మేఁకపోతు లింద్రాది దేవతలకుఁ, బశుపురోడాశం బయిన సంబంధమునఁ దమ్ముంగాచు గొల్లవానితోఁ గూడి స్వర్గాది భోగంబుల ననుభవించునట! రాజ్యలోభంబునఁ గ్రోధంబు పెంచి సమరరంగంబున నన్యోన్యహింసాపరులైన వీరపురుషులు సూర్యమండలంబు సొచ్చి పోయి దివ్యపదంబు లనుభవింతురట! కామాతురలైన సతులు పతులం బాయలేక కళేబరంబులు కౌఁగిలించుకొని యనలంబుఁ బ్రవేశించి యుత్తమగతులం బొందుదురట! సమ్యగ్జ్ఞానసంపన్నులై నీదాసులై దేహంబులందు నీ లాంఛనంబులైన