పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శ్రీ వేంకటేశ్వర వచనములు

బ్రసన్నుండవు; తుది విచారించిన జగత్కర్తవు; ఇట్టి నీ గుఱుతు తెలియంగ వచ్చునయ్యా! పెక్కురూపంబులు గలవాఁడవు; పెక్కునామంబులు గలవాఁడవు; వేదవాదులకును నగోచరుండవు; నిన్నుం కొలువనేరము, నీవే కరుణించి కావవే శ్రీ వేంకటేశ్వరా!

16

కోనేటినిలయా! విరజానదిపర్యంతంబును విడువని ప్రాకృతదేహంబును మోచిన జీవులు తమతమసామర్థ్యంబుల జీవన్ముక్తుల మయ్యెదమన నెట్లువచ్చు? ఇట్టి ప్రకృతిసంబంధంబున వచ్చిన యింద్రియంబులేల జయింపనిచ్చు? అందులకుఁ గారణంబైన మనస్సు నేరీతి నిర్మలంబగును? తన్మూలంబునం జేసినకర్మంబు లేల శాంతింబొందు? నయిన నౌఁ గా కేమి! ఎందులకు నేలా భయంబునొంద? నిందులకుఁ గారణం బిన్నివిధంబులం బ్రవర్తిల్లెడు నీమాయ. నిన్నుం గొల్చినవారికి నీ మాయ నుపసంహరింపనేర్తువు. తాళముచే యొకవంక నుండఁగాఁ దలుపుతోఁ బెనంగఁగా నేల? ఇది యెఱింగికదా మున్నిట్టివారలు కొందఱు నీదాసులయి నిన్నుం బొగడియు, నీకు శరణుసొచ్చియును మహాత్ములయిరి. ఏము నదియె యుపాయంబని యెఱుంగుకొంటిమి. శ్రీ వేంకటేశ్వరా!

17

అప్రమేయా! భువి నెన్ని మాయోపాయంబులు గలిగిన నీ దాస్యమునకు నీడురావు. చేయవచ్చు బహువిధపుణ్యంబులు; నీవు దేవుండ వని తెలియు విజ్ఞానమునకు సరిగావు. నేరం దగు యోగాభ్యాసంబులు; ఇవి నీభక్తితో సరిగావు. ఉండుఁగాకేమి పెద్దతనంబులు కొందఱికిని; నీ శరణాగత ధర్మంబుతోఁ బురుణింపరావు. వెలయుచున్నవి పెక్కుశబ్దంబులు; నీతిరుమంత్రస్తోత్రంబువలె ఫలంబు లొసగవు. ఇది యెఱుగుదు. ఇంక నానావిద్యలు నీ సంకీర్తనవిద్యంబోలవు. నిగుడెదరు ముప్పది మూఁడు గోట్ల దేవతలు; నీవంటి బలవంతులు గారు. నీ విచ్చు